న్యూఢిల్లీ: భారత్ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) వృద్ధి రేటు 6.7 శాతం పుంజుకుంటుందని తెలిపింది. ఆదాయపన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల తగ్గింపుతో వినియోగానికి ఊతమిస్తుందని, దీంతో వృద్ధి రేటు బలపడుతుందని వివరించింది.
అమెరికా టారిఫ్‌ల ప్రభావం నెలకొన్నప్పటికీ.. బలమైన వినియోగంతో దేశీ వృద్ధి పటిష్టంగా ఉన్నట్టు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి 6.8 శాతంగా ఉంటుందన్నది ఆర్‌బీఐ అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. సెపె్టంబర్ త్రైమాసికం జీడీపీ గణాంకాలు ఈ నెల 28న విడుదల కానున్నాయి.
అమెరికాతో ఒప్పందం
అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం చేసుకుంటే అది అనిశ్చితులు తగ్గేందుకు, విశ్వాసం పెరుగుదలకు దారితీస్తుందని ఎస్‌అండ్‌పీ తెలిపింది. ఇది కార్మికుల ఆధారిత రంగాలకు ప్రయోజనం కలిగిస్తుందని తెలిపింది. ‘‘జీఎస్‌టీ రేట్లు తగ్గించడం మధ్య తరగతి వినియోగానికి మద్దతునిస్తుంది. దీనికి ఆదాయపన్ను తగ్గింపు, వడ్డీ రేట్ల తగ్గింపు కూడా తోడవుతుంది. ఈ మార్పులతో పెట్టుబడుల కంటే వినియోగం వృద్ధిని బలంగా నడిపిస్తుంది’’అని పేర్కొంది.
గత బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు (కొత్త పన్ను విధానం కింద) కలి్పంచడం తెలిసిందే. ఇక ఆర్‌బీఐ వరుస వడ్డీ రేట్ల తగ్గింపుతో రెపో రేటు మూడేళ్ల కనిష్ట స్థాయి 5.5 శాతానికి దిగిరావడం గమనార్హం. అలాగే, సెప్టెంబర్ 22 నుంచి 375 వస్తువులపై జీఎస్‌టీ తగ్గడం తెలిసిందే. భారత ఎగుమతుల విస్తరణపై అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఉందంటూ.. అంతిమంగా భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను అమెరికా తగ్గించే అవకాశాలున్నట్టు అభిప్రాయపడింది.


