రీల్స్ ద్వారా వ్యాపార ప్రకటనలు
సినీనటులు, క్రీడాకారులకు పోటీగా డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు
బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని టెండూల్కర్ చెప్పాల్సిన పని లేదు.. అందమైన చీరలు షూటింగ్ షర్టింగులు అంటూ విజయశాంతి ఊయలూగుతూ చెప్పే అవసరం లేదు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా అంటూ కాజల్ అగర్వాల్ గోడలు అద్దాలు బద్దలుకొట్టుకుని రావాల్సిన అవసరం లేదు.. ఇంకా ఇప్పుడు పట్టణాలు.. నగరాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్ లు కటవుట్లు .. ఫ్లెక్సీలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు.. కాలం మారింది.. మారుతోంది.. ఇంకా మారనున్నది.. వివిధ ఉత్పత్తుల ప్రచారం కోసం సెలబ్రిటీలు.. సినిమా నటులు.. క్రీడాకారులు మాత్రమే యాడ్ ఫిలిమ్స్ లో నటించాలని రూలేం లేదు.. వాళ్లకు లక్షలు.. కాదు కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడంతా ట్రెండ్ మారింది.. మున్ముందు ఇంకా మారుతుంది.
సోషల్ మీడియా.. ముఖ్యంగా ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్ ఫారాలు వచ్చాక కమర్షియల్స్ .. అంటే యాడ్ ఫిలిమ్స్ రూపకల్పన తీరు మారిపోతోంది. దీనికోసం సెలబ్రిటీలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు పాతిక లక్షలమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సిద్ధంగా ఉన్నారు.. వీరు సినిమా సెలబ్రిటీలు.. స్పోర్ట్స్ పర్సన్స్ కాదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే ప్రచారం చేస్తారు.
ఐదారేళ్ళ క్రితం వరకు
ఒకప్పుడు భారతదేశంలో మార్కెటింగ్ అంటే హోర్డింగులు, సెలబ్రిటీ ఎండా ర్సుమెంట్లు, మెరుపువెలుగుజిలుగులు.. తళుక్కుమనే టీవీ ప్రకటనలే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో రీల్స్ చేసేవాళ్ళు.. నేరుగా కష్టమర్లతో మాట్లాడే వారే వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు. వారు ఏం కొనాలి.. ఎందుకు కొనాలన్నది ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వివరించి చెబుతున్నారు.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) అనే ఒక ప్రఖ్యాత మార్కెట్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారత కంటెంట్ క్రియేటర్ ఎకానమీ కీలక మలుపు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 నుంచి 25 లక్షల మంది డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు యాక్టివ్‌గా ఉన్నారు. వీరంతా సొంత రీల్స్, కంటెంట్ పోస్ట్ చేస్తూనే వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ ఆదాయం కూడా పొందుతున్నారు.
వీరి ప్రభావంతో వినియోగదారుల కొనుగోలు నిర్ణయాల్లో 30 శాతానికి పైగా మార్పు వస్తుండగా, వార్షికంగా రూ. 350–400 బిలియన్ డాలర్ల (సుమారు లక్షల కోట్ల రూపాయల) వ్యయం ఈ క్రియేటర్ల ప్రభావంలో జరుగుతోంది. 2030 నాటికి ఈ సంఖ్య 1 ట్రిలియన్ డాలర్లను దాటే అవకాశముందని అంచనా.
ఈ వీరి ప్రభావం మరింత విస్తృతం అవుతుందని బీసీజీ అంచనా వేస్తోంది. ఇది ఇకపై వైరల్ డ్యాన్స్ వీడియోలు లేదా మేకప్ ట్యుటోరియల్స్‌కే పరిమితం కాదు. ఫ్యాషన్, టెక్నాలజీ, బ్యూటీ, రోజువారీ అవసరాలు వంటి అన్ని విభాగాల్లోనూ ఈ క్రియేటర్లు దూసుకుపోతున్నారు.
BCG అధ్యయనం ప్రకారం:
60 శాతం మంది వినియోగదారులు క్రమం తప్పకుండా క్రియేటర్ కంటెంట్‌ను చూస్తున్నారు.30 శాతం కంటే ఎక్కువ మంది తమ కొనుగోలు నిర్ణయాలకు క్రియేటర్లే కారణమని చెబుతున్నారు. ఎవరెవరో సినిమా నటులు, క్రికెటర్లు చెప్పే ప్రకటనలకన్నా కమ్యూనిటీ ఆధారిత నమ్మకమే ఇప్పుడు ప్రధానంగా మారింది. మనకు తెలిసినవాళ్ళు చెప్పే ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు మక్కువ చూపుతున్నారని తెలుస్తోంది.
ఇకముందు ఈ 'కంటెంట్ క్రియేటర్లను తాత్కాలిక ప్రచార సాధనంగా కాకుండా, దీర్ఘకాల భాగస్వాములుగా చూసే బ్రాండ్లే విజేతలుగా నిలుస్తాయి. వాళ్ళ ఉత్పత్తులే ఎక్కువగా మార్కెట్లోకి వెళ్తాయి అని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు అయితే క్రియేటర్లను కేవలం తమ ఉత్పత్తుల ప్రచారం కోసమే కాకుండా అమ్మకాలు పెంచుకోవడం, ఇంకా ధరను కూడా వారిద్వారానే నిర్ణయించేలా వ్యూహాలు రూపొందించి సక్సెస్ అవుతున్నారు. వీరితో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుని తమ వ్యాపారాలు పెంచుకుంటున్నాయి. ఎంత ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటే అంతపెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా వారిని గుర్తిస్తూ తమ వ్యాపారంలో భాగస్వాములను చేస్తున్నారు.
--సిమ్మాదిరప్పన్న


