దగ్గుకు బ్రాందీ, దురదకు విస్కీ.. తాతయ్య షాక్! | Nalgonda Wines Staff Prank On Elderly Man Video Viral | Sakshi
Sakshi News home page

దగ్గుకు బ్రాందీ, దురదకు విస్కీ.. తాతయ్య షాక్!

Feb 8 2026 11:21 AM | Updated on Feb 8 2026 12:58 PM

Nalgonda Wines Staff Prank On Elderly Man Video Viral

మెడికల్‌ షాపునకు వెళ్లబోయి పక్కనే వైన్స్‌లోకి వెళ్లిన వృద్ధుడు

దగ్గు సిరప్‌ అంటూ వృద్ధుడికి బ్రాందీ బాటిల్‌ ఇచ్చారు

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో 

నల్గొండ జిల్లా : మెడికల్‌ షాపు అనుకొని పక్కనే ఉన్న వైన్స్‌లోకి వృద్ధుడు వెళ్లగా.. అతడికి దగ్గు మందు అని చెప్పి వైన్స్‌ సిబ్బంది బ్రాందీ, విస్కీ బాటిళ్లు ఇస్తూ ఆటపట్టించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. శాలిగౌరారం మండలం ఎన్‌జి కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఒంట్లో నలతగా ఉందని రెండు రోజుల క్రితం మండల కేంద్రంలోని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద చూపించుకుని పక్కనే ఉన్న మెడికల్‌ షాపులో మందులు కొనుక్కునేందుకు వెళ్లాడు. 

అయితే మెడికల్‌ షాపు, ఫస్ట్‌ఎయిడ్‌ సెంటర్, వైన్స్‌ పక్కపక్కనే ఉండటంతో ఆ వృద్ధుడు పొరపాటున మెడికల్‌ షాపు అనుకొని వైన్స్‌లోకి వెళ్లాడు. వైన్స్‌ సిబ్బంది ఒకరు టేబుల్‌పై వరుసగా మద్యం బాటిళ్లు పెట్టుకొని వైద్యుడి గెటప్‌లో ఏమైందని వృద్ధుడిని అడుగుతూ చేయి పట్టుకొని పరిశీలించగా.. ఇదంతా మరో వ్యక్తి వీడియో తీశాడు. దగ్గు వస్తుందని, ఒళ్లంతా దురద ఉందని ఆ వృద్ధుడు చెప్పడంతో అతడికి దగ్గుకు ఒక బ్రాందీ సీసా, దురదకు ఒక విస్కీ సీసా ఇచ్చి ఎంత మోతాదులో తాగాలో కూడా చెప్పాడు. వారం రోజుల తర్వాత మళ్లీ వచ్చి మరో రకం బ్రాందీ తీసుకెళ్లాలని ప్రిస్కిప్షన్‌ కూడా రాసి ఇచ్చాడు.

 ఏం తినాలో.. ఏం తినవద్దో కూడా వృద్ధుడికి వివరించాడు. ఇదంతా తెలియని వృద్ధుడు అతడు ఇచ్చిన మద్యం బాటిళ్లు సిరప్‌లు అనుకొని అతను చెప్పేదంతా తల ఊపుతూ విన్నాడు. ఈ వీడియోపై కొందరు వ్యంగంగా తీసుకోగా.. మరికొందరు మాత్రం వృద్ధుడితో అలా చేయడం సరికాదని విమర్శిస్తున్నారు. ఈ వైరల్‌ వీడియోపై సంబంధిత వైన్స్‌ సిబ్బందిని అడుగగా.. ఆ వృద్ధుడు తమకు వరుసకు తాత కావాలని, అతడు మద్యం కొనేందుకు వైన్స్‌ షాపు వద్దకు రావడంతో సరదాగా వీడియో తీశామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement