చిన్న పొరపాటు.. పెద్ద ప్రమాదం! | Car Accident Near Nidmanoor Nalgonda | Sakshi
Sakshi News home page

చిన్న పొరపాటు.. పెద్ద ప్రమాదం!

Feb 8 2026 11:38 AM | Updated on Feb 8 2026 1:01 PM

Car Accident Near Nidmanoor Nalgonda

నిడమనూరు (నల్లగొండ జిల్లా):  కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. ఓ కుటుంబంలో విషాదం నింపింది. శనివారం రాత్రి నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద సాగర్‌ ఎడమకాల్వలోకి కారు దూసుకుపోయి త్రిపురారం మండలం కంపాసాగర్‌కు చెందిన తల్లం పుల్లయ్య, పద్మావతి ఇద్దరు మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతం వారి బంధువుల రోదనలతో ఉద్రిక్తంగా మారింది. డ్రైవర్‌ రసూల్‌.. కారు నడుపుతున్న క్రమంలో చెప్పు జారీపోయిందని.. కాలుకు చెప్పును సరిచేసుకుంటున్న క్రమంలో కాలు కారు యాక్సిలేటర్‌కు తగిలి.. కారు వేగం పెరిగి అదుపుతప్పి కాల్వలోకి దూసుకపోయిందని చెబుతున్నాడు. 

తాను కారు అద్దం తెరుచుకుని బయటికి వచ్చి కేకలు వేయడంతో కాల్వ సమీపంలో ఉన్న వ్యక్తులు.. కొబ్బరిమట్ట ఇవ్వగా పట్టుకొని కాల్వలో నుంచి బయటపడ్డానని చెప్పాడు. కానీ తల్లం పుల్లయ్య, పద్మ కాల్వలో గల్లంతయ్యారు. రాత్రి పది గంటల ప్రాంతంలో కాల్వలో కారును గుర్తించారు. వయస్సు పైబడటం, కారు డోర్ లాక్ కావడంతో నీటిలో మునిగి ఇద్దరు మృతి చెందారు. కాల్వలో నుంచి కారును బయటికి తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కాల్వలో నీటి ప్రవాహం 8 వేల క్యూసెక్కులకు పైగా ఉంది. దీంతో కాల్వలోకి దిగి సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందిగా మారింది.  క్రేన్ సహాయంతో కారును కూడా బయటకు తీసేందుకు యత్నం

కాల్వ వెంట బారికేడ్లు లేక..
సాగర్‌ ప్రధాన కాల్వపై ఉన్న బ్రిడ్జిల వద్ద పక్కల వెంట కనీసం బారికేడ్లు లేవు. కాల్వలోకి వెళ్లకుండా సూచికలు, అడ్డంగా రాతిస్తంబాలు లేకపోవడంతో కారు నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. 

Advertisement
 
Advertisement
Advertisement