సూపర్ స్మార్ట్ సిటీ చేస్తా
నల్లగొండ టూటౌన్: నల్లగొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీ చేయడమే ధ్యేయమని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అండగా నిలవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 6వ డివిజన్ అభ్యర్థి కర్నాటి సునంద కర్నాకర్‌రెడ్డికి మద్దతుగా ఏఆర్‌నగర్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 6వ డివిజన్‌కు అధిక నిధులు ఇచ్చి ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దే విధంగా చొరవ తీసుకుంటామన్నారు. సునంద కర్నాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, ఏఆర్‌నగర్, శాంతినగర్ కాలనీల అభివృద్ధి తాను చూసుకుంటానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి కర్నాటి సునంద కర్నాకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


