తిప్పర్తి : ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన గ్రామసభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న మూడేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అంతజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలతోపాటు ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు చేస్తుందన్నారు. తిప్పర్తి మండలంలో రూ.60లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. రూ.6 కోట్లతో జూనియర్ కళాశాల, రూ.26 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ నిర్మాణానికి రూ.70 లక్షలు, కాల్వల మరమ్మతులకు రూ.3.50 కోట్లు మంజూరు చేశామన్నారు. నెల రోజుల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లను పూర్తిచేసి గృహ ప్రవేశాలను చేయనున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ సొంతంగా రూ.20వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మండల కేంద్రానికి త్వరలో ముఖ్యమంత్రిని తీసుకొస్తానన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మండలంలో 352 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. సర్పంచ్‌లు, అధికారుల సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. సర్పంచ్ బద్ధం రజితసుధీర్ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, సర్పంచ్ ముత్తినేని శ్యాంసుందర్, నాయకులు ఊట్కూరి సందీప్‌రెడ్డి, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ జానయ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఫ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు
ఫ తిప్పర్తి గ్రామ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


