గ్యాస్‌ వినియోగదారులు ఆందోళన చెందవద్దు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ వినియోగదారులు ఆందోళన చెందవద్దు

Apr 2 2026 8:52 AM | Updated on Apr 2 2026 8:52 AM

నల్లగొండ టౌన్‌ : వంటగ్యాస్‌ సరఫరా మెరుగు పడిందని గ్యాస్‌ కోసం వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎల్‌పీజీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు పగిడి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మట్లాడుతూ అవసరం లేకున్నా గ్యాస్‌ బుకింగ్‌ చేయవద్దని, సిలిండర్‌ డెలివరీ చేసిన సమయంలో సీలు, బరువు, లీకేజీ లేని విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు. బుకింగ్‌ చేసుకున్న సీరియల్‌ ప్రకారమే గ్యాస్‌ సరఫరా చేస్తామని తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

నల్లగొండ : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న 14 ప్రతిభా కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అర్హులైన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నల్లగొండ ప్రాంతీయ సమన్వయ అధికారి బి.జానునాయక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జేఈఈ, ఎంసెట్‌, ఐఐటీ, నీట్‌, ఏఐఐఎంఎస్‌ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల గిరిజన విద్యార్థులు ఈ నెల 7వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మీ సేవ చార్జీల పెంపు

నల్లగొండ : సేవలకు మీసేవ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎ కేటగిరిలో ప్రస్తుతం రూ.35 ఉన్న మీసేవ చార్జీలు 62కు, బి కేటగిరిలో రూ.45 ఉన్న చార్జీలు రూ.80కి పెంచినట్లు తెలిపారు. మీ సేవ నిర్వహకులు ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

పారాక్వాట్‌ నిషేధం

నల్లగొండ అగ్రికల్చర్‌ : ప్రజల పాలిట యపాశంలా మారిన పారాక్వాట్‌ (గడ్డి మందు)ను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రధానంగా ఈ మందును మెట్టపంటల్లో కలుపు నివారణ కోసం వాడుతుంటారు. దీంతో గడ్డి జాతులకు చెందిన పలు రకాల కలుపు వెంటనే చనిపోతోంది. కూలీల ఖర్చు లేకుండా చాలామంది ఈ మందునే వాడుతున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు.. ఇలా పలు కారణాలతో జిల్లాలో నిత్యం ఏదోఒక చోట ఎవరో ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలా క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలు చాలాకాలంగా చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా గడ్డిమందు తాగేవారి మరణాలు అధికమయ్యాయి. గడ్డిమందుకు విరుగుడు లేకపోవడంతో ఈ మందును ఏమాత్రం తీసుకున్నా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలురకాల గడ్డిమందులు, అందులోనూ పారాక్వాట్‌పై నిషేధం విధించాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఈ ఉత్పత్తులను నిషేధిస్తూ తీర్మాణించింది. మార్చి 31న రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ జీఓ 24ను విడుదల చేస్తూ వెంటనే నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement