కొండమల్లేపల్లి: అల్యూమినియం వస్తువులను చోరీ చేసిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కొండమల్లేపల్లి ఎస్సై అజ్మీరా రమేష్ ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఇద్దరు మహిళలు సామగ్రి గల బస్తాను తీసుకెళ్తున్నారు. వారు పోలీసులను చూసి భయంతో పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. బస్తాను తనిఖీ చేయగా అందులో పాత అల్యూమినియం వస్తువులు ఉన్నాయి. ఇద్దరు మహిళలు పట్టణ కేంద్రానికి చెందిన జంగాల కాలనీవాసులు పర్వతం కోటమ్మ, వీరమ్మగా పోలీసులు గుర్తించారు. చెత్త ఏరుకునే క్రమంలో వినాయక బైక్ రిపేర్ షాప్ నుంచి అల్యూమినియం వస్తువులను దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు కొండమల్లేపల్లి ఎస్సై తెలిపారు. దొంగలను పట్టుకున్న ఎస్సై రమేష్, క్రైమ్ సిబ్బంది హేము, భాస్కర్‌లను ఉన్నతాధికారులు అభినందించినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు.


