ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్‌లో ఇంధన సంక్షోభం దృష్ట్యా లాక్‌డౌన్ విధించినున్నారన్న వార్తల నడుమ అక్కడి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వీకెండ్ లాక్‌డౌన్’ ప్లాన్‌కు ప్రావిన్షియల్ (రాష్ట్ర) ప్రభుత్వాలు గట్టిగా నో చెప్పడంతో ప్రస్తుతానికి లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనుకకు తీసుకుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు మండిపోతున్న వేళ, పాక్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక పొదుపు చర్యల్లో భాగంగా పలు ఆంక్షలను పరిశీలించింది. అయితే, తాజా పరిణామాలతో దేశవ్యాప్తంగా ఎలాంటి షట్‌డౌన్ ఉండబోదని స్పష్టమైంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో పాకిస్తాన్ తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కోబోతోందని, దీనిని నియంత్రించేందుకు ఏప్రిల్ 4 లేదా 5 నుంచి ‘స్మార్ట్ లాక్‌డౌన్’ అమలు చేస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
శని, ఆదివారాల్లో మార్కెట్లు మూసివేయడం, పెళ్లిళ్లు, బహిరంగ సభలపై నిషేధం, రవాణాపై ఆంక్షలు వంటి ప్రతిపాదనలతో ఒక ముసాయిదా కూడా సిద్ధమైంది. ఈ కీలక అంశంపై చర్చించేందుకు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్షతన ‘ఐవాన్-ఎ-సదర్’లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. లాక్‌డౌన్ విధిస్తే సామాన్యుల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని, ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్రాల మద్దతు లభించకపోవడంతో కేంద్రం తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.
ప్రస్తుతానికి దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు భరోసా ఇచ్చారు. లాక్‌డౌన్ల కంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, ప్రజలకు ఆర్థిక ఊరటనిచ్చే చర్యలపైనే తాము దృష్టి సారిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెరిగిన జెట్ ఫ్యూయల్ ధరలు, ఇతర ఇంధన సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: ‘జైషే’కు భారీ దెబ్బ.. తాహిర్ అనుమానాస్పద మృతి


