‘జైషే’కు భారీ దెబ్బ.. తాహిర్ అనుమానాస్పద మృతి | Masood Azhars brother dies in Pakistan | Sakshi
Sakshi News home page

‘జైషే’కు భారీ దెబ్బ.. తాహిర్ అనుమానాస్పద మృతి

Mar 31 2026 11:53 AM | Updated on Mar 31 2026 12:56 PM

Masood Azhars brother dies in Pakistan

బహావల్పూర్: భారత గడ్డపై నెత్తురు ఏరులు పారించిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్తాన్‌లో మృతి చెందాడు. అతని మరణం వెనుక ఉన్న అసలు కారణాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.

అనుమానాస్పద స్థితిలో మృతి
చాలా కాలంగా జైషే మహమ్మద్ కార్యకలాపాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న తాహిర్ అన్వర్ పాకిస్తాన్‌లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. జైషే మహమ్మద్ తన అధికారిక ఛానల్ ద్వారా ఈ మృతిని ధృవీకరించింది. బహావల్పూర్‌లోని జామియా మసీద్ ఉస్మాన్ వలీలో అతడి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే అతను  అనారోగ్యంతో చనిపోయాడా లేక ఏదైనా ప్రమాదానికి గురయ్యాడా అనే విషయంలో సంస్థ మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

భారత్‌కు పక్కలో బల్లెంలా జైషే..
భారత పార్లమెంటుపై దాడి (2001), పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ స్ట్రైక్ (2016), యూరి దాడి, 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా దాడి (2019) తదితర దారుణాల వెనుక మసూద్ అజహర్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ హస్తం ఉంది. ఈ సంస్థలో తాహిర్ అన్వర్ ఏళ్ల తరబడి కీలక వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు.

‘ఆపరేషన్ సింధూర్’తో కోలుకోలేని దెబ్బ
గత ఏడాది ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టాయి. బహావల్పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయం లక్ష్యంగా జరిగిన ఈ మెరుపు దాడుల్లో మసూద్ అజహర్ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఆ దాడుల్లో అజహర్ సోదరి, మేనల్లుడు సహా సుమారు 10 మంది బంధువులు హతమైనట్లు గత సెప్టెంబర్‌లోనే ఆ సంస్థ పరోక్షంగా అంగీకరించింది. 

ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ డ్రగ్ కింగ్.. ఇందిర హంతకుడి బంధువా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement