కొంతమంది ఆటోమొబైల్ ఔత్సాహికులు అప్పుడప్పుడు.. కొన్ని అద్భుతాలను చేస్తుంటారు. ఇందులో భాగంగానే.. బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి 18 రోజుల్లో ఐదు సీట్ల ఎలక్ట్రిక్ జీపును నిర్మించారు. అయితే ఆ వ్యక్తి దీనికోసం చేసిన ఖర్చు ఎంత?, ఇది ఒక ఫుల్ ఛార్జిపైన ఎన్ని కిమీ దూరం ప్రయాణిస్తుంది అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
బీహార్‌కు చెందిన ముర్షిద్ ఆలం ఒక చిన్న దుకాణం నడుపుతూ వాహనాలను మరమ్మతు చేసేవారు. తన గ్యారేజీలో పనిచేస్తున్నప్పుడు, గ్రామాల్లోని రైతులు & చిన్న వ్యాపార యజమానులకు రోజువారీ ప్రయాణానికి లేదా వ్యవసాయ పనులకు తక్కువ ధరలో, సమర్థవంతమైన రవాణా ఎంపిక లేకపోవడాన్ని గమనించారు. అయితే డీజిల్ & పెట్రోల్ వాహనాలు ఖరీదైనవి.. వాటి నిర్వహణ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి వచ్చేది. ఎలక్ట్రిక్ వాహనాలు గ్రామీణ వినియోగదారులకు అందుబాటులో లేవు.
ఇవన్నీ గమనించిన ముర్షిద్.. గ్రామ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ ఎలక్ట్రిక్ జీపును రూపొందించాలనుకున్నారు. దీంతో లక్ష రూపాయలు వెచ్చించి, కేవలం 18 రోజుల్లో ఎలక్ట్రిక్ జీపు సిద్ధం చేశారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీనిని స్థానికులు "దేశీ టెస్లా" అని పిలుచుకుంటున్నారు.
ఇదీ చదవండి: సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర ఎంతంటే?
ముర్షిద్ తయారు చేసిన ఎలక్ట్రిక్ జీపులో ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన నాలుగు చక్రాలు, స్పీడోమీటర్, పవర్ స్టీరింగ్ & ఛార్జింగ్ పాయింట్ ఉన్నాయి. పంటలు, ఎరువులు & ఇతర వస్తువులను తీసుకెళ్లడానికి ఒక ట్రాలీని కూడా జత చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు ఐదు గంటలు పడుతుంది.


