భారీ నగదు పురస్కారం అందుకున్న వైభవ్ సూర్యవంశీ | Vaibhav Suryavanshi Pockets Half Crore Cash For His Outstanding Performance In U19 World Cup, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

భారీ నగదు పురస్కారం అందుకున్న వైభవ్ సూర్యవంశీ

Feb 23 2026 10:03 AM | Updated on Feb 23 2026 10:22 AM

Vaibhav Suryavanshi Pockets Half Crore Cash After Skipping Board Exams

భారత యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ చేతుల మీదుగా భారీ నగదు పురస్కారం అందుకున్నాడు. ఇటీవల జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనలు చేసినందుకు గానూ బిహార్‌ ప్రభుత్వం వైభవ్‌కు 'పశుపతినాథ్ యోజన' స్కీం కింద రూ.50 లక్షల చెక్కును అందజేసింది. 

నిన్న (ఫిబ్రవరి 22) పాట్నాలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో నితీశ్‌ కుమార్‌ చేతుల మీదుగా వైభవ్‌ ఈ క్యాష్‌ ప్రైజ్‌ను అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో బిహార్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా, సమ్రాట్ చౌధరి తదితరులు పాల్గొన్నారు. పలువురు అధికారులు వైభవ్‌ను సన్మానించారు. 

వైభవ్‌ ఇటీవల పదో తరగతి బోర్డు పరీక్షలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచాడు. క్రికెట్‌పై ఫోకస్‌ పెట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపాడు. త్వరలో జరుగబోయే ఐపీఎల్‌ 2026 కోసం వైభవ్‌ ఇప్పటినుంచే ప్రాక్టీస్‌ షురూ చేశాడు. వైభవ్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ మరోసారి రీటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే. 

వైభవ్‌ గత ఎడిషన్‌లోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. తొలి ఎడిషన్‌లోనే అతను రాయల్స్‌ తరఫున అద్భుతాలు చేశాడు. 7 మ్యాచ్‌ల్లో 206 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, హాఫ్‌ సెంచరీ సాయంతో 252 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌పై వైభవ్ చేసిన 38 బంతుల శతకం ఐపీఎల్‌ చరిత్రలో భారత ఆటగాడు చేసిన అత్యంత వేగవంతమైన శతకం కావడం విశేషం. అరంగేట్రం ఎడిషన్‌లో, అదీ 14 ఏళ్ల వయసులోనే ఈ ఫీట్‌ను సాధించిన వైభవ్‌ రాత్రికిరాత్రే సూపర్‌ స్టార్‌ అయ్యాడు.

స్వరాష్ట్రం అండదండలు  
వైభవ్ చిన్న వయసులోనే కోచ్ మనీష్ ఓజా మార్గదర్శకత్వంలో రోజుకు 600 బంతులు ఎదుర్కొంటూ కఠిన శిక్షణ పొందాడు. స్వరాష్ట్ర క్రికెట్‌ సంఘం (బిహార్‌) నుంచి అతనికి అత్యంత​ పిన్న వయసులోనే రంజీ ట్రోఫీ అవకాశం కూడా లభించింది. బిహార్‌ క్రికెట్‌ బోర్డు అండదండలే వైభవ్‌ కెరీర్‌కు పునాది అయ్యాయి.  

రెండో అత్యధిక రన్‌ స్కోరర్‌  
ఇటీవల జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో వైభవ్‌ రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 62.71 సగటున 439 పరుగులతో మెరిశాడు. ఫైనల్లో ఇంగ్లండ్‌పై అతను చేసిన భారీ శతకం (80 బంతుల్లో 175 పరుగులు) భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement