స్పిన్‌కు ఎదురొడ్డి... స్పిన్‌తోనే పడగొట్టి... | England Beat Sri Lanka By 51 Runs In T20 World Cup ENG Vs SL, Check Out Score Details And Match Highlights | Sakshi
Sakshi News home page

T20 WC 2026: స్పిన్‌కు ఎదురొడ్డి... స్పిన్‌తోనే పడగొట్టి...

Feb 23 2026 4:16 AM | Updated on Feb 23 2026 11:20 AM

England beat Sri Lanka by 51 runs in T20 World Cup

‘సూపర్‌–8’లో ఇంగ్లండ్‌ బోణీ 

శ్రీలంకపై 51 పరుగులతో గెలుపు

మెరిసిన జాక్స్, సాల్ట్, ఆర్చర్‌  

పల్లెకెలె: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఇంగ్లండ్‌ జట్టు టి20 ప్రపంచకప్‌ ‘సూపర్‌–8’లో శుభారంభం చేసింది. ఆదివారం గ్రూప్‌–2లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 51 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను బోల్తా కొట్టించింది. గ్రూప్‌ దశలో పడుతూ లేస్తూ సాగిన ఇంగ్లండ్‌... ‘సూపర్‌ ఎయిట్‌’లో సాధికారిక విజయం ఖాతాలో వేసుకుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 

జోస్‌ బట్లర్‌ (7), జాకబ్‌ బెథెల్‌ (3), టామ్‌ బాంటన్‌ (6), కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (14), స్యామ్‌ కరన్‌ (11), డాసన్‌ (6) విఫలమయ్యారు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ (21; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. సొంతగడ్డపై శ్రీలంక బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఒక్క సాల్ట్‌ తప్ప మిగిలిన వాళ్లెవరూ భారీ షాట్‌లు ఆడలేకపోయారు. 

లంక బౌలర్లలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలాగె 3 వికెట్లు పడగొట్టగా... మధుషనక, తీక్షణ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక పూర్తిగా తడబడింది. 16.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ షనక (24 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఒక్కడే పోరాడగా... తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విల్‌ జాక్స్‌ 3 వికెట్లు తీయగా... ఆర్చర్, డాసన్, ఆదిల్‌ రషీద్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.  

సాల్ట్‌ ఒక్కడే... 
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ సాల్ట్‌ ఒక్కడే దూకుడు కనబర్చాడు. లంక బౌలర్ల ధాటికి సహచర బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరుతున్నా... సాల్ట్‌ మాత్రం తనదైన శైలిలో షాట్‌లు ఆడాడు. వరల్డ్‌కప్‌ తొలి పోరులో నేపాల్‌ చేతిలో ‘చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు’ గెలిచిన ఇంగ్లండ్‌...‘సూపర్‌ –8’లోనూ అలాంటి అనుభవమే చవిచూసేలా కనిపించింది. అయితే సాల్ట్‌ మెరుపులకు బౌలర్ల సహకారం తోడవడంతో ... ఇంగ్లండ్‌ పని సులువైంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 15 బౌండరీలు మాత్రమే నమోదైతే... శ్రీలంక కేవలం 12 బౌండరీలకే పరిమితమైంది.  

పవర్‌ ప్లేలోనే 34/5... 
ఓ మాదిరి లక్ష్యఛేదనలో లంక తడబడింది. ఇంగ్లండ్‌ బౌలర్లు ఆర్చర్, జాక్స్‌ ధాటికి... ఆరు ఓవర్లు ముగిసేసరికి 34/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. నిసాంక (9), కమిల్‌ (6), కుశాల్‌ మెండిస్‌ (4), పవన్‌ రత్నాయకే (0), దునిత్‌ వెల్లలాగె (10) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు. కెప్టెన్‌ షనక కాస్త పోరాడే ప్రయత్నం చేసినా... ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి వికెట్ల పతనం అలాగే కొనసాగింది. దీంతో శ్రీలంక లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. తదుపరి ‘సూపర్‌–8’ మ్యాచ్‌ల్లో మంగళవారం పాకిస్తాన్‌తో ఇంగ్లండ్‌; బుధవారం న్యూజిలాండ్‌తో శ్రీలంక తలపడతాయి.

Advertisement
 
Advertisement
Advertisement