‘సూపర్‌–8’ సమయం | Key matches in the T20 World Cup from today | Sakshi
Sakshi News home page

‘సూపర్‌–8’ సమయం

Feb 21 2026 4:07 AM | Updated on Feb 21 2026 4:07 AM

Key matches in the T20 World Cup from today

టి20 ప్రపంచకప్‌లో నేటి నుంచి కీలక మ్యాచ్‌లు

తొలి పోరులో కివీస్‌తో పాక్‌ ఢీ 

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం  

టి20 ప్రపంచ కప్‌లో మరింత వినోదానికి నేటితో తెర లేవనుంది. పసికూనలు, పస లేని జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించగా టాప్‌–8 టీమ్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ‘సూపర్‌ ఎయిట్స్‌’లో భాగంగా నేడు జరిగే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ తలపడుతుంది. గ్రూప్‌ ‘ఎ’లో మూడు మ్యాచ్‌లు గెలిచి పాక్‌ ముందంజ వేయగా, గ్రూప్‌ ‘డి’ నుంచి కూడా మూడు విజయాలతో కివీస్‌ తర్వాతి దశకు అర్హత సాధించింది.  

కొలంబో: పాకిస్తాన్, న్యూజిలాండ్‌ జట్లు ఇటీవల వన్డేలు, టి20 ఫార్మాట్‌లలో తరచుగా తలపడ్డాయి. రెండున్నరేళ్ల వ్యవధిలో ఇరు జట్ల మధ్య 41 మ్యాచ్‌లు జరగ్గా... ఇందులో 17 వన్డేలు, 24 టి20లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి బలాబలాల గురించి ఇరు జట్లకు మంచి అవగాహన ఉంది. 

ద్వైపాక్షిక సిరీస్‌లను మినహాయిస్తే... 2022 టి20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత రెండు జట్లు ఒక పెద్ద టోర్నీలో పోటీకి దిగడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌ జట్టు లీగ్‌ దశను దాటినా... అంచనాలకు తగినట్లుగా ఆడలేకపోతోంది. సీఫెర్ట్, అలెన్‌ మాత్రమే బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించగా... రచిన్‌ రవీంద్ర, ఫిలిప్స్, డరైల్‌ మిచెల్‌ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. బౌలింగ్‌లో కూడా డఫీ, సోధి భారీగా పరుగులిస్తున్నారు. 

కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ వైఫల్యం కూడా వరల్డ్‌ కప్‌లో జట్టును ఇబ్బంది పెట్టింది. ఇలాంటి స్థితిలో వరల్డ్‌ కప్‌ ఆశలు మిగలాలంటే కివీస్‌ బృందం సత్తా చాటాల్సి ఉంది. మరోవైపు పాకిస్తాన్‌కు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడటం కాస్త కలిసొచ్చే అంశం. ముఖ్యంగా ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో మ్యాచ్‌ ఆడిన ఆ జట్టుకు పిచ్‌ పరిస్థితిపై మంచి అవగాహన ఉంది. అందుకే తమ స్పిన్‌ బలగాన్ని జట్టు నమ్ముకుంది. 

ప్రధాన పేసర్‌ షాహిన్‌ అఫ్రిది ఘోరంగా విఫలం కాగా... మరో పేసర్‌ ఫహీమ్‌ ఒక్క ఓవర్‌ కూడా బౌలింగే చేయలేదు. స్పిన్నర్లు ఉస్మాన్‌ తారిఖ్, అబ్రార్, షాదాబ్, నవాజ్‌లపై జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే బ్యాటింగ్‌లో ఫర్హాన్‌ మినహా సయీమ్‌ అయూబ్, సల్మాన్, బాబర్‌ ఆజమ్‌ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. తాజా పరిస్థితిని బట్టి చూస్తే ఇరు జట్లు ఫామ్‌లో సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఆసక్తికర పోరు ఖాయం. మ్యాచ్‌ రోజున వర్షసూచన ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement