జెండా ఊపి ప్రారంభించనున్న బాక్సర్ విజేందర్, టెన్నిస్ లెజెండ్ బోపన్న
30 వేల మందికి పైగా పాల్గొననున్న ఔత్సాహికులు
రేపే దేశ రాజధానిలో మారథాన్
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ప్రతిష్టాత్మక ‘ఢిల్లీ మారథాన్’కు రంగం సిద్ధమైంది. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఉదయం జరిగే ఈ సుదీర్ఘ పరుగును భారత బాక్సింగ్ దిగ్గజం విజేందర్ సింగ్, టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. సుమారు 30 వేల పైచిలుకు మంది ఔత్సాహికులు ఇందులో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ), అంతర్జాతీయ మారథాన్, డిస్టెన్స్ రేస్ (ఏఐఎంఎస్), ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) గుర్తింపు పొందిన ఈ సుదీర్ఘ పరుగులో కేవలం భారతీయులే కాదు విదేశీ మారథాన్ రన్నర్లు, పలువురు క్రీడాకారులు కూడా పాల్గొనేందుకు నగరానికి విచ్చేసినట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ మారథాన్ నాలుగు విభాగాల్లో జరుగుతోంది. ఇందులో మొదటిది పూర్తి మారథాన్.
42.195 కిలోమీటర్ల దూరం పరుగెత్తడం. దీంతో పాటు హాఫ్ మారథాన్ (21.09 కి.మీ.), 10కే (10 కిలో మీటర్లు), 5కే (5 కిలో మీటర్లు) పరుగు పందెంలు కూడా నిర్వహిస్తారు. అంటే సుదీర్ఘ పరుగు (42.21 కి.మీ) చేయలేని వారుసైతం నిరాశచెందకుండా 10కే, 5కే ఈవెంట్లో పరుగు పూర్తిచేయవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాల్లోని 490 నగరాలకు చెందిన ఔత్సాహికులు ఇందులో పాల్గొంటున్నారు. భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మారథాన్ ప్రియులు పరుగు పెట్టేందుకు తహతహలాడుతున్నారు.
దేశీ క్రీడాకారులు అనిశ్ థాపా, బెలియప్ప, మన్ సింగ్, అక్షయ్ సైని, గోపీ, భాగిరథి బిస్త్, నిర్మాబెన్ ఠాకూర్, అశ్విని మదన్ జాదవ్, దిస్కెట్ డోల్మా, స్టాన్‌జిన్ డోల్కర్ తదితరులు కూడా పోటీపడుతున్నారు. ఆసియా క్రీడల క్వాలిఫయింగ్ టైమింగ్‌ను నమోదు చేసిన రన్నర్లకు ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో పోటీపడేందుకు అర్హత కూడా లభిస్తుంది.
ఈ మారథాన్ పరుగు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తుంది. సమగ్ర వ్యర్థాల విభజన, ఒకసారి వాడి పారేసి ప్లాస్టిక్‌ను నిషేధించి... రీ సైక్లింగ్‌కు ఉపయోగపడే ప్లాస్టిక్ ఉత్పత్తులను ప్రోత్సహించడం... ఇందుకోసం పర్యావరణ సంస్థలు, కలిసి వచ్చే స్థానికులు, అధికారులతో మారథాన్ ఆర్గనైజర్లు చేతులు కలుపుతారు.


