ఒకట్రెండేళ్లలో ‘ఏఎస్‌ఐ’: ఆల్ట్‌మన్
‘‘కృత్రిమ మేధ ఫలాలు అందరికీ అందాలంటే దాన్ని పూర్తిగా ప్రజాస్వామీకరించడమే ఏకైక మార్గం. అదే సముచితం కూడా’’అని దిగ్గజ ఏఐ కంపెనీ ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కుండబద్దలు కొట్టారు. గురువారం ఏఐ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సర్వత్రా చర్చనీయంగా మారిన ఆరి్టఫిíÙయల్ సూపర్ ఇంటలిజెన్స్ (ఏఎస్‌ఐ) తాలూకు తొలి వెర్షన్లు అందుబాటులోకి రావడానికి మరో ఒకట్రెండేళ్లు పట్టవచ్చని అభిప్రాయపడ్డారు.
అన్ని విషయాల్లోనూ మానవ మేధను మించిపోయే ఏఎస్‌ఐని కృత్రిమ మేధ ప్రస్థానంలో కీలకమైన తదుపరి అడుగుగా భావిస్తున్నారు. ‘‘ఏఎస్‌ఐ ఆగమనానికి ఓపెన్‌ఏఐ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. ప్రజాస్వామిక ఏఐ అన్నది ఈ విషయంలో మేం విశ్వసించే మౌలిక సూత్రాల్లో మొట్టమొదటిది. మానవాళి సమగ్ర ప్రగతికి అదే అత్యుత్తమ మార్గం’’అని స్పష్టం చేశారు. 2028 చివరికల్లా ప్రపంచ మేధోసామర్థ్యమంతా దాదాపుగా డేటా సెంటర్లలోనే నిక్షిప్తమై ఉంటుందని ఆల్ట్‌మన్ అంచనా వేశారు. ఏఐ సాంకేతికత మున్ముందు సాఫ్ట్‌వేర్ పరిశ్రమ తీరుతెన్నులనే సమూలంగా మార్చేయనుందని జోస్యం చెప్పారు.
మా పెట్టుబడుల గమ్యస్థానం భారతే: మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్‌కు అతి పెద్ద ఏఐ పెట్టుబడుల గమ్యస్థానాల్లో భారత్‌ది అగ్ర స్థానమని సంస్థ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ వెల్లడించారు. ఏఐ వినియోగంలో గ్లోబల్ సౌత్ దేశాలు భారత్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. ‘‘ఈ విషయంలో గ్లోబల్ సౌత్ చేయాల్సింది ఎంతో ఉంది. డేటా సెంటర్లతో పాటు కనెక్టివిటీ, విద్యుత్... ఇలా మొత్తంగా మౌలిక సదుపాయాలన్నీ ఎంతగానో మెరుగవ్వాలి. ఇందుకు భారీ పెట్టుబడులు కావాలి.
ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగమూ ముందుకొస్తేనే ఇది సాధ్యం. గ్లోబల్ సౌత్‌లో ఏఐ విస్తరణకు వచ్చే పదేళ్లలో ఏకంగా 50 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించడానికి కారణం కూడా అదే’’అని వెల్లడించారు. తమ పెట్టుబడి ప్రణాళికల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. టెక్నాలజీ అంతరాలను పూడ్చేందుకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు ముఖ్యమే అయినా మానవ నైపుణ్యాలే అత్యంత కీలకమని స్మిత్ చెప్పారు.
ఏఐ దుర్వినియోగ కట్టడిలో భారత్‌దే కీలకపాత్ర: దరియో
ఏఐ వాడకం ఎన్నో సవాళ్లను తెరపైకి తెస్తోందని ఆంత్రోపిక్ సీఈఓ దరియో అమొదెయ్ అభిప్రాయపడ్డారు. ఏఐ మోడళ్ల స్వతంత్ర ప్రవర్తన మరిన్ని సమస్యలకు దారితీస్తోందన్నారు. ‘‘వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా ఏఐ దుర్వినియోగం పెరిగిపోతోంది. మున్ముందు ఇది పెద్ద సమస్యగా మారనుంది’’అంటూ ఆందోళన వెలిబుచ్చారు. దాన్ని కట్టడి చేయడంలో భారత్ కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
చారిత్రకంగా గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ అన్ని విషయాల్లోనూ ఉన్నత ప్రమాణాలు నిర్దేశించిందని ఆయన గుర్తు చేశారు. టెక్నాలజీ ఫలాలు ఆయా దేశాలకు అందడంలో కూడా కీలక పాత్ర పోషిస్తూ వచి్చందన్నారు. ‘‘తొలి ఏఐ సదస్సు 2023లో జరిగింది. ఈ మూడు నాలుగేళ్లలోనే ఏఐ రంగం అనూహ్య ప్రగతి సాధించింది.
వాణిజ్యపరంగానే గాక సామాజికంగా కూడా ఏఐ వాడకాన్ని దేశాలన్నీ పూర్తిస్థాయిలో అందిపుచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో పలు నైతిక సమస్యలు, సందేహాలు తెరపైకి వస్తున్నాయి. వాటికి తక్షణం సమాధానాలు కనిపెట్టాల్సిన అవసరముంది. ఎందుకంటే ఏఐ సాంకేతికత పలు విషయాల్లో మానవ మేధను అధిగమించే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ఏఐ మోడళ్లు సూపర్ హ్యూమన్ సామర్థ్యాలతో పనులు చక్కబెట్టనున్నాయి.
దేశాల మేధో సామర్థ్యమంతా ఇకపై డేటా సెంటర్లలో నిక్షిప్తం కానుంది. కనీవినీ ఎరగని ఈ పరిణామాలు మానవాళికి అవకాశాలతో పాటు మరెన్నో సవాళ్లను కూడా తేనున్నాయి. ఏఐతో అందివచ్చే అవకాశాల వల్ల కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడతారు. దీర్ఘకాలంగా చికిత్స లేని రోగాలకు పరిష్కారం దొరుకుతుంది. అదే సమయంలో ఏఐ వ్యవస్థల స్వతంత్ర పనితీరు విపరిణామాలకు దారి తీయవచ్చు. వ్యక్తులు, వ్యవస్థలు, కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడా వాటిని దుర్వినియోగం చేయవచ్చు’’అని అమొదెయ్ హెచ్చరించారు.
గ్లోబల్ లీడర్‌గా భారత్: రషీద్ ప్రేమ్‌జీ
ఏఐ వినియోగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగే సువర్ణావకాశం భారత్ ముందు ఉందని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రషీద్ ప్రేమ్‌జీ అన్నారు. ఈ విషయమై వచ్చే కొన్నేళ్లలో భారత్ తీసుకోబోయే విధానపరమైన నిర్ణయాలు కీలకమని అభిప్రాయపడ్డారు. దానిపైనే దేశ ఆర్థిక ప్రగతి, 140 కోట్ల ప్రజల సమస్యలకు మెరుగైన పరిష్కారాలు ఆధారపడతాయన్నారు. ‘‘ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఏఐ టాలెంట్ పూల్ భారత్ సొంతం.
ఇది తిరుగులేని సానుకూలత. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏఐకి, టాలెంట్‌కు మన దేశం గమ్యస్థానంగా మారుతోంది. నేడు దేశవ్యాప్తంగా ఏకంగా 6.5 లక్షల మంది నిపుణులు ఏఐ, సంబంధిత రంగాల్లో నిత్యం కృషి చేస్తున్నారు. మరో ఏడాదిలో వారి సంఖ్య రెట్టింపు కానుంది. యూపీఏ పేమెంట్ల విధానం భారత్‌లో ఎంతగా సక్సెస్ అయిందో ప్రపంచమంతా చూస్తోంది. డీప్‌టెక్, ఏఐ స్పేస్‌లో 4,000 పై చిలుకు స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. దేశ ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఏఐ పటిమను పెంచుకోగలిగితే అద్భుతాలు సాధ్యపడతాయి’’అని ప్రేమ్‌జీ చెప్పారు.
ఏఐ ఎడ్యుకేషన్‌లో భారత్ భేష్: యాక్సెంచర్
విద్యా వ్యవస్థలో ఏఐని అంతర్భాగంగా తీర్చిదిద్దడంలో భారత్ చేస్తున్న కృషి అద్భుతమని యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ అన్నారు. ‘‘ప్రాథమిక విద్యలోనే ఏఐని భాగంగా చేయడం నిజంగా అభినందనీయం. దీన్ని అన్ని దేశాలూ అందిపుచ్చుకోవాల్సిన అవసరముంది’’అని ఆమె అభిప్రాయపడ్డారు. ఏఐ వర్క్‌ఫోర్స్ విషయంలో కూడా భారత్ అగ్ర స్థానంలో ఉందని గుర్తు చేశారు. ‘‘అభ్యసన నిరంతర ప్రక్రియ అన్నది ఏఐ రాకతో మరింత వాస్తవంగా మారింది. సంస్థలైనా, దేశాలైనా కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుంటేనే ప్రగతి పథంలో ముందుకు వెళ్తాయి’’అని స్పష్టం చేశారు.
భారత ఏఐ మోడల్స్ ప్రపంచానికి ఆదర్శం: ఫిలిప్స్
వైద్య రంగంలో భారత్ తయారు చేస్తున్న ఏఐ మోడళ్లు ప్రపంచానికి ఆదర్శమని రాయల్ ఫిలిప్స్ సీఈఓ రాయ్ జాకబ్స్ అన్నారు. ఈ రంగంలో గ్లోబల్ మోడల్స్‌లో సంస్కరణలకు దారి చూపగల సత్తా వాటి సొంతమని అభిప్రాయపడ్డారు. ‘‘ఏఐ సాంకేతికత అత్యంత ప్రభావం చూపగల రంగాల్లో ఆరోగ్యం కీలకమైనది. ఈ రంగంలో ఏఐ వాడకంలో భారత్ చాలా ముందుంది. దీనికి ప్రభుత్వం అందిస్తున్న చేయూతకు ఆయుష్మాన్ భారత్, డిజిటల్ మిషన్ వంటివి నిదర్శనం. ఆరోగ్య రంగంలో భారత్‌ను గ్లోబల్ ఇన్నొవేషన్ ఇంజన్‌గా ఫిలిప్స్ పరిగణిస్తోంది’’అని చెప్పారు.
దూకుడైన వ్యూహాలే మార్గం: మెటా
ఏఐ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టాలంటే సరైన విధానాలు, భారీ పెట్టుబడులతో పాటు దూకుడైన వ్యూహాలు కూడా చాలా కీలకమని టెక్నాలజీ దిగ్గజం మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ ఆలెగ్జాండర్ వాంగ్ అన్నారు. దేశాలన్నీ దీనిపై తక్షణం దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఏఐ టూల్స్ అన్ని అవసరాలనూ తీర్చేందుకు అనువుగా రూపొందాలి. అంతే తప్ప అన్నింటికీ ఒకే టెక్నాలజీ వాడుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు. ప్రాంతం, భాష, సంస్కృతి వంటివాటితో నిమిత్తం లేకుండా ప్రజలంతా ఏఐ టెక్నాలజీని సులువుగా వాడుకోగలగాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగం ఒక్కతాటిపైకి వస్తేనే అది సాధ్యం’’అన్నారు. ఇందుకోసం ‘పర్సనల్ సూపర్ ఇంటలిజెన్స్’దిశగా మెటా కృషి చేస్తోందని గుర్తు చేశారు. మనుషుల బిజీ జీవితాలను చక్కగా ప్లాన్ చేయడం తదితరాలకు ఇది దోహదపడుతుందని చెప్పారు.
ఇన్నొవేషన్‌కు భారత్ సారథ్యం: ష్నీడర్
‘‘దేశాల ప్రగతి ప్రస్థానంలో కృత్రిమ మేధతో పాటు ఇంధన మేధ (ఎనర్జీ ఇంటలిజెన్స్–ఇంధన మేధ) పాత్ర కూడా నానాటికీ కీలకంగా మారుతోంది. ఆ రెండు రంగాలూ పరస్పరం అవిభాజ్యంగా రూపొందుతున్నాయ. అలాంటి ఈ కీలక రంగాల్లో గ్లోబల్ ఇన్నొవేషన్‌కు సారథ్యం వహించే సువర్ణావకాశం భారత్ ముందుంది’’అని ష్నీడర్ ఎలక్ట్రిక్ సీఈఓ ఒలివియర్ బ్లుమ్ అభిప్రాయపడ్డారు.
ఆ రంగాలకు ప్రభుత్వ, పరిశ్రమపరంగా లభిస్తున్న బలమైన మద్దతే ఇందుకు కారణమని చెప్పారు. ఏ రంగంలోనైనా భారత్‌లో నిలదొక్కుకోగలిగిన సంస్థ ప్రపంచంలో మరెక్కడైనా రాణించవచ్చని చెప్పారు. ‘‘వ్యయ నియంత్రణ, ఇన్నొవేషన్, తిరుగులేని నైపుణ్యం, అపార మానవ వనరులతో ఏఐ విప్లవానికి భారత్ సారథిగా మారుతోంది. ఇంధనం, ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీ తదితరాల్లో తిరుగులేని సామర్థ్యాలు ఆ దేశానికి ఎంతగానో కలిసొస్తున్నాయి’’అని చెప్పారు.
వికటించే రిస్కుతో జాగ్రత్త: నీలేకని
‘‘ఏఐ రంగంలో శరవేగంగా సాధిస్తున్న ప్రగతి అన్ని రంగాలకూ విస్తరించేలా చూడటం చాలా ముఖ్యం. తద్వారా ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు అది ఉపయోగపడాలి’’అని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. లేదంటే ఏదో ఒక దశలో ఏఐ టెక్నాలజీ వికటించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. ఏఐ రాకతో సాఫ్ట్‌వేర్ తదితర వృత్తి నిపుణుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఏఐ ఇండియా సదస్సులో భాగంగా ఏఐ ప్రభావం తదితరాలపై ఆంత్రోపిక్ సీఈఓ దరియో అమొదెయ్‌తో నీలేకని ముచ్చటించారు. డీప్‌ఫేక్ సమస్య వంటి ఏఐ తాలూకు ప్రతికూల పార్శా్వలను కూడా ఆయన ఉదాహరించారు.


