భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం అందరికీ గర్వకారణం. కేవలం 15 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలోని తొమ్మిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. సేవల రంగంలో గణనీయమైన వృద్ధి, మౌలిక సదుపాయాల వ్యయం పెరగడం, జీఎస్టీ, డిజిటలైజేషన్, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం.. వంటి కీలకమైన సంస్కరణలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. దాంతోపాటు బలమైన స్థూల ఆర్థిక స్థిరత్వం, అధిక మూలధన వ్యయం ఇందుకు ఎంతో తోడ్పడ్డాయి. అయితే భారత్ దశాబ్ద కాలంలో ఏమేరకు వృద్ధి చెందిందో అదే రీతిలో ప్రజల ఆదాయాలు పెరిగాయా అంటే లేదనే చెప్పాలి. ఏయే విభాగాల్లో పెట్టుబడి పెట్టినవారి ఆదాయాలు ఎంతమేరకు వృద్ధి చెందాయో కింద చూద్దాం.
ఉద్యోగాలు పెరిగినా..
భారతదేశ వృద్ధి పథంలో భాగంగా ఉద్యోగ కల్పన దశాబ్ద కాలంలో మెరుగ్గానే ఉంది. గడిచిన పదేళ్లలో దాదాపు 17 కోట్ల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. 2004-2014 కాలంతో పోలిస్తే ఉద్యోగ కల్పనలో తయారీ రంగం వాటా మెరుగుపడగా సర్వీసులు, నిర్మాణ రంగాల్లో అధిక కొలువులొచ్చాయి. అయినప్పటికీ జీవన నాణ్యత సంక్లిష్టంగా ఉంది. వైట్-కాలర్ ఉద్యోగాల్లో(ఫ్రొఫెషనల్ ఉద్యోగాలు) వేతన పెరుగుదల జీడీపీ విస్తరణ కంటే తక్కువగా ఉంది. కొత్తగా ఉద్యోగ మార్కెట్లో ప్రవేశించిన వారిలో ఎక్కువ భాగం అనధికారిక లేదా గిగ్ (Gig) వర్క్‌లో చేరుతున్నారు. భారతదేశం ఏటా వృద్ధి నమోదు చేస్తున్నట్లుగా ఉద్యోగులు వేతనాలు, వారి ఆదాయాలు వృద్ధి చెందడం లేదు.
పెట్టుబడిదారులకు లాభాలు
భారతదేశ వృద్ధి దశలో ఇటీవలి కాలంలో ఈక్విటీ ఇన్వెస్టర్లు లబ్ధిదారులుగా ఉన్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) ఇన్వెస్టర్ల పొదుపును అమాంతం పెంచేశాయి. సెప్టెంబర్ 2025 నాటికి వివిధ ఈక్విటీల్లో సిప్‌ల కింద ఉన్న ఆస్తులు సుమారు రూ.15.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 10 కోట్లకు పైగా సిప్ ఖాతాల ద్వారా ప్రస్తుతం నెలకు సుమారు రూ.20,000 కోట్లకు పైగా నిధులను ఈక్విటీ మార్కెట్లలోకి మళ్లిస్తున్నారు.
గత ఐదేళ్లలో నిఫ్టీ 50, నిఫ్టీ 500 సుమారు 170-200 శాతం రాబడిని అందించాయి. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు 300-380 శాతం వరకు పెరిగాయి. 2010 ప్రారంభంలో సిప్‌లను ప్రారంభించిన పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలు రెట్టింపు అయ్యాయి. ఇది ఆర్థికంగా చాలా కుటుంబాలకు సాధికారత కల్పించింది.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్లు
నగరాల్లోని చాలా మంది పొదుపుదారులకు స్టాక్ మార్కెట్‌లోని రాబడులు తమ జీతం పెరుగుదలను అధిగమించాయి. ప్రధానంగా ఎస్ఐపీ ద్వారా సృష్టించిన సంపద వార్షిక వేతన పెంపు కంటే ఎక్కువగా ఉంది. దీనికి విరుద్ధంగా సాంప్రదాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టినవారికి ఎక్కువగా రాబడులు లేవు. పెద్దగా ఆదరణలేని ప్రదేశాల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్లు, బ్యాంకు డిపాజిట్లు వంటి వాటిలో ఆశించిన రాబడి రాలేదు. ఆహారం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి నిత్యావసరాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది.
మీరు నిజంగా ధనవంతులా?
భారతదేశం ఆర్థికంగా వేగంగా దూసుకుపోతోంది. అధిక జీడీపీ ర్యాంక్, మెరుగైన మూలధన మార్కెట్లు, బలమైన డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాలు దీనికి నిదర్శనం. అయితే, ‘మీరు ధనవంతులా?’ అనే ప్రశ్నకు సమాధానం అసమానంగా ఉంటుంది. స్థిరమైన సిప్ పెట్టుబడిదారులు, ఐటీ, ఫైనాన్స్, న్యూఏజ్(కొత్తగా, వేగంగా విస్తరిస్తున్న రంగాలు) సర్వీసులు వంటి అధిక వృద్ధి రంగాల్లో నిపుణుల నికర విలువలో అభివృద్ధి కనిపిస్తోంది. అయితే స్థిరమైన వేతనం లేనివారు, ఈక్విటీలో పెట్టుబడులు లేని సాధారణ జీతం పొందే సిబ్బంది ఈ సంపద సృష్టి నుంచి దూరంగా ఉన్నారు.
భారతదేశం ప్రపంచంలోనే మెరుగైన ఆర్థిక దేశాల్లో ఐదో స్థానానికి ఎగబాకడం సంతోషకరమైన అంశమే. అయితే ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉండాలి. దేశ వృద్ధికి అనుగుణంగా అన్ని రంగాల్లోని ప్రజల ఆదాయాలు వృద్ధి చెందాల్సి ఉంటుంది. ఈ ప్రయోజనాలు అందరికీ అందేలా ప్రభుత్వం, వ్యవస్థలు చర్యలు తీసుకోవాలి. ఈక్విటీ మార్కెట్ విజయాన్ని ‘ఇండియా గ్రోత్ స్టోరీ’గా మార్చాలంటే, వేతన వృద్ధి, ఉద్యోగ నాణ్యతను మెరుగుపరచడం తదుపరి ఆర్థిక సంస్కరణల ప్రధాన లక్ష్యం కావాలి.
ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే..


