అంచనాలు పెంచిన ఫిచ్
గత అంచనా 6.9 శాతం
రెపో పావు శాతం తగ్గించొచ్చని అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచాలను పెంచుతున్నట్టు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. 2025–26లో 6.9 శాతం వృద్ధి నమోదుకావొచ్చన్న గత అంచనాను 7.4 శాతానికి పెంచింది. ఈ ఏడాది ప్రైవేటు వినియోగం వృద్ధికి ప్రధాన చోదకంగా ఉన్నట్టు వివరించింది. దీనికి తోడు ఇటీవల చేపట్టిన జీఎస్‌టీ సంస్కరణలతో సెంటిమెంట్ మెరుగుపడినట్టు తెలిపింది.
ద్రవ్యోల్బణం గణనీయంగా దిగిరావడంతో ఆర్‌బీఐ డిసెంబర్ సమీక్షలో మరో పావు శాతం రెపో రేటును తగ్గించి, 5.25 శాతం చేయొచ్చని అంచనా వేసింది. 2025లో 100 బేసిస్ పాయింట్లు (ఒక శాతం) తగ్గింపునకు ఇది అదనమని పేర్కొంది. జూన్ త్రైమాసికంలో (క్యూ1) 7.8 శాతం, సెప్టెంబర్ త్రైమాసికంలో (క్యూ2) 8.2 శాతం చొప్పున జీడీపీ వృద్ధి నమోదు కావడంతో ఫిచ్ రేటింగ్స్ తన అంచనాలను సవరించినట్టయింది.
కాకపోతే ద్వితీయ ఆరు నెలల్లో వృద్ధి రేటు కొంత నిదానించొచ్చని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) భారత్ జీడీపీ వృద్ధి 6.4 శాతానికి తగ్గుతుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఆర్థిక పరిస్థితులు సరళంగా మారితే వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవచ్చని పేర్కొంది. అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 0.3 శాతానికి తగ్గడం తెలిసిందే. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్‌టీ కింద 375 ఉత్పత్తులపై రేట్లు తగ్గడం ఇందుకు అనుకూలించింది.


