మార్కెట్లు రికార్డుల వేటలో
చిన్న ఇన్వెస్టర్లు అమ్మకాల బాటలో
2 నెలల్లో రూ. 23,000 కోట్లు వెనక్కి
ఫండ్స్ పెట్టుబడుల కొనసాగింపు
ఈ కేలండర్ ఏడాది(2025) మార్చి మొదలు రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడులపట్ల కొంతమేర విముఖతను ప్రదర్శిస్తున్నారు. దీంతో అప్పుడప్పుడూ కొనుగోళ్లకు కట్టుబడినప్పటికీ అడపాదడపా విక్రయాలకే అధిక ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఇదే బాటలో గత రెండు నెలల్లో మరింత అధికంగా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ద్వారా స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..
కొద్ది నెలలుగా ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతూ కదులుతున్నాయి. ఇటీవలే ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 86,100 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 26,300ను అధిగమించాయి. ఈ బాటలో గత రెండు నెలల్లోనూ హెచ్చుతగ్గుల మధ్య లాభాలు ఆర్జించాయి. అక్టోబర్‌లో ఇండెక్సులు 4.5 శాతం పుంజుకోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్(100) 5.8 శాతం, స్మాల్ క్యాప్(100) 4.7 శాతం చొప్పున ఎగశాయి.
ఈ ప్రభావంతో నవంబర్‌లోనూ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ మరింత బలపడినప్పటికీ స్మాల్ క్యాప్ 3 శాతం క్షీణించింది. సరిగ్గా ఇదే సమయంలో అంటే గత రెండు నెలల్లో రిటైల్ ఇన్వెస్టర్లు ఉమ్మడిగా రూ. 23,405 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఈ ట్రెండ్ ఇప్పటివరకూ 2025 పొడవునా కనిపించినట్లు విశ్లేషకులు తెలియజేశారు.
అప్రమత్తతతో..
నిజానికి మార్కెట్లు బలపడుతున్నప్పుడు విక్రయాలకు ప్రాధాన్యమిస్తూ వచి్చన రిటైలర్లు దిద్దుబాటుకు లోనైనప్పుడు కొనుగోళ్లు చేపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. తద్వారా దేశీ స్టాక్స్‌పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. అయితే మరోపక్క ఇదే సమయంలో దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్) పెట్టుబడులను కొనసాగించడం ప్రస్తావించదగ్గ అంశం!
వివిధ పథకాలలో కొంతమంది రిటైలర్లు సిప్‌ల ద్వారా పెట్టుబడులు కొనసాగించడం మ్యూచువల్ ఫండ్‌లకు దన్నుగా నిలుస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా స్వల్పకాలిక పెట్టుబడుల విషయంలో రిటైలర్లు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. అధిక విలువల్లో కొనుగోలు చేసిన షేర్ల విషయంలోనూ మార్కెట్ల తీరు ఆధారంగా కొద్దిపాటి నష్టాలకు లేదా లాభాలకు అమ్మకాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. మరోపక్క అంతగా లాభాలకు ఆస్కారం లేదనిపించిన దీర్ఘకాలిక పెట్టుబడులపైనా ఇదే ధోరణి అనుసరిస్తున్నట్లు వివరించారు.
ఐపీవోలలోనూ
2025లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 96 ఇష్యూలు రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించాయి. అయితే రిటైలర్లు ఐపీవోలో లిస్టింగ్ లాభాలకోసమే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో లిస్టింగ్ రోజునే అత్యధిక శాతం ఇన్వెస్టర్లు హోల్డింగ్స్ విక్రయించడం ద్వారా పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేశారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్


