BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన | BCCI Announces India squad for IND vs SA T20I series Gill To Be | Sakshi
Sakshi News home page

BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

Dec 3 2025 5:54 PM | Updated on Dec 3 2025 6:32 PM

BCCI Announces India squad for IND vs SA T20I series Gill To Be

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలోని టీమిండియాలో మొత్తంగా పదిహేను మంది సభ్యులకు చోటిచ్చినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇక వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా అందుబాటులో ఉంటాడని బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది. అదే విధంగా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరినట్లు తెలిపింది. అయితే, చాన్నాళ్లుగా టీ20 జట్టుతో కొనసాగుతున్న రింకూ సింగ్‌పై ఈసారి వేటుపడటం గమనార్హం.

కాగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్టు సిరీస్‌లో సఫారీల చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. తొలి వన్డేలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది.

ఈ క్రమంలో డిసెంబరు 6న మూడో మ్యాచ్‌తో వన్డే సిరీస్‌ ముగియనుండగా.. డిసెంబరు 9- 19 వరకు టీ20 సిరీస్‌ నిర్వహిస్తారు. ఇక ప్రొటిస్‌ జట్టుతో తొలి టెస్టు సందర్భంగా మెడ నొప్పితో క్రీజును వీడిన టెస్టు సారథి గిల్‌.. రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న గిల్‌.. టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుబ్‌‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌.

భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ షెడ్యూల్‌
🏏తొలి టీ20: డిసెంబరు 9- కటక్‌, ఒడిశా
🏏రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్‌పూర్‌, పంజాబ్‌
🏏మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్‌ ప్రదేశ్‌
🏏నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్‌
🏏ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్‌, గుజరాత్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement