IND vs SA: ప్రపంచ రికార్డు సమం చేసిన కోహ్లి | IND vs SA: Virat Kohli Equals Kane Williamson World Record Check | Sakshi
Sakshi News home page

IND vs SA: ప్రపంచ రికార్డు సమం చేసిన కోహ్లి

Dec 3 2025 5:09 PM | Updated on Dec 3 2025 5:29 PM

IND vs SA: Virat Kohli Equals Kane Williamson World Record Check

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేల్లో శతక్కొట్టిన కోహ్లి.. రాయ్‌పూర్‌లో రెండో వన్డేలోనూ సెంచరీతో కదం తొక్కాడు. తద్వారా చాన్నాళ్ల తర్వాత ‘విన్‌టేజ్‌’ కోహ్లిని గుర్తు చేస్తూ వరుసగా రెండు శతకాల (Back to Back Centuries)తో సత్తా చాటాడు.

ఈ క్రమంలో న్యూజిలాండ్‌ దిగ్గజ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamsion) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి సమం చేశాడు. ఇంతకీ అదేమిటి అంటారా?... ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 తర్వాత ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కోహ్లి (Virat Kohli) పునరాగమనం చేశాడు. కానీ, ఆసీస్‌ గడ్డపై తొలి రెండు వన్డేల్లో అనూహ్య రీతిలో అతడు డకౌట్‌ అయ్యాడు.

అయితే, మూడో వన్డేలో అజేయ అర్ధ శతకం (74) బాది ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్‌లో (IND vs SA ODIs)నూ దుమ్ములేపుతున్నాడు. సఫారీలతో తొలి వన్డేలో 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌... రెండో వన్డేలో తొంభై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కోహ్లి శతక ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి.

మొత్తంగా రాయ్‌పూర్‌లో 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 102 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లుంగి ఎంగిడి బౌలింగ్‌లో.. ఐడెన్‌ మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 22 పరుగులు జోడించిన కోహ్లి.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (105)తో కలిసి 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.

అనంతరం తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో కలిసి 27 పరుగులు జోడించి కోహ్లి నిష్క్రమించాడు. కాగా సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అంతకు ముందు కివీస్‌ స్టార్‌ కేన్‌ విలియమ్సన్‌.. సౌతాఫ్రికాపై ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా ఉండగా.. కోహ్లి తాజాగా కేన్‌ మామ ప్రపంచ రికార్డును సమం చేశాడు.

సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లి సెంచరీలు
🏏కోల్‌కతా వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ 2023లో 101 నాటౌట్‌
🏏రాంచి వేదికగా 2025లో 135 పరుగులు
🏏రాయ్‌పూర్‌ వేదికగా 2025లో 102 పరుగులు

చదవండి: IND vs SA: గంభీర్ నమ్మక‌మే నిజమైంది.. శతక్కొట్టిన రుతురాజ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement