రాయ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ నాండ్రే బర్గర్ గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసే క్రమంలో బర్గర్ తొడ కండరాలు పట్టేశాయి.
ఆ ఓవర్‌లో తొలి బంతిని కాస్త ఇబ్బంది పడుతూనే సంధించిన బర్గర్.. రెండో బంతిని మాత్రం బౌల్ చేయలేకపోయాడు. బంతిని వేసే క్రమంలో అతడు రెండు సార్లు తన రన్ అప్‌ను కోల్పోయాడు. బర్గర్ ఆసౌకర్యంగా కన్పించాడు.
వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. అయినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆ సమయంలో బర్గర్ నడిచేందుకు ఇబ్బంది పడినట్లు కన్పించింది. అతడు తిరిగి మైదానంలో రాలేదు. ఓవరాల్‌గా 6.1 ఓవర్లు బౌలింగ్ చేసిన బర్గర్ 43 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.
అయితే టీ20 సిరీస్‌కు ముందు బర్గర్ గాయపడడం సౌతాఫ్రికా టీమ్‌మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఇప్పటికే స్టార్ పేసర్ కగిసో రబాడ కూడా గాయం కారణంగా జట్టు బయట ఉన్నాడు. టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఆ సమయానికి బర్గర్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.
భారత్ భారీ స్కోర్..
ఇక రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(102), రుతురాజ్ గైక్వాడ్(105) సెంచరీలతో సత్తాచాటగా.. కేఎల్ రాహుల్(66) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రోటీస్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు.
చదవండి: IND vs SA 2nd Odi: విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్


