ప్రియమైన వ్యక్తి కష్టపడి, కన్నీళ్లను దాటి విజయం సాధించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం. అది కేవలం విజయం కాదు, ఏళ్లుగా పంచుకున్న కలలు, వెన్నుదన్నుగా నిలిచిన నమ్మకానికి దక్కిన ప్రతిఫలంగా నిలుస్తుంది. సరిగ్గా అలాంటి అపురూప క్షణమే ఢిల్లీకి చెందిన ఓపెన్‌సాక్స్.ఏఐ (Opensox.ai) వ్యవస్థాపకుడు అజిత్ జీవితంలో చోటుచేసుకుంది. ఆయన తమ్ముడు నాలుగేళ్ల శ్రమ తర్వాత యూట్యూబ్ నుంచి మొదటి సంపాదన అందుకున్నాడు. దీని వివరాలు అజిత్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.
అనుమానించినా నమ్మకం కోల్పోలేదు
అజిత్ తన తమ్ముడి విజయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకున్నప్పుడు ఆ పోస్ట్ తక్షణమే వేలమంది దృష్టిని ఆకర్షించింది. ‘నా తమ్ముడు ఈ రోజు కోసం గత నాలుగేళ్లుగా కష్టపడుతున్నాడు’ అని చెప్పాడు. తన చుట్టూ ఉన్నవారంతా తమ్ముడిని అనుమానించినా అజిత్ మాత్రం నిరంతరం అతనికి వెన్నుదన్నుగా నిలిచారు. ‘అతను తన కలలను పంచుకోవడానికి నేను మాత్రమే ఉన్నాను’ అని అజిత్ రాశారు. ‘ప్రతి ఒక్కరూ అతనిని చూసి నవ్వినప్పుడు తనకు అండగా నేను మాత్రమే ఉన్నాను’ అని తెలిపారు. యూట్యూబ్ ద్వారా తన తమ్ముడు నాలుగేళ్లు కష్టపడి రూ.9000 సంపాదించినట్లు ఉన్న స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. ఎంత డబ్బు అకౌంట్‌లో క్రెడిట్ అయిందనే విషయాన్ని పక్కనుంచితే ఈ పోస్ట్ భావోద్వేగ సంతృప్తిని కలిగించినట్లు చెప్పుకొచ్చారు.
my younger brother has been working hard for the last 4 years to see this day.
first income from youtube. ❤️
still remember when everyone used to laugh at him and i was the only one he had to share things about his dreams.
day is made. ❤️ pic.twitter.com/t4TYoiJGAk— Ajeet ( opensox.ai ) (@ajeetunc) December 1, 2025
కష్టానికి దక్కిన ప్రతిఫలం
తమ్ముడి విజయాన్ని ప్రకటించిన అజిత్ పోస్ట్‌పై నెటిజన్లు స్పందించారు. ఒక వినియోగదారు తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ ‘ఎవరైనా యూట్యూబ్ వీడియోలు చేస్తే ప్రజలు ఎలాంటి పాయింట్ లేకుండా విమర్శిస్తారు. కానీ చాలా కష్టపడి పనిచేసిన తర్వాత బహుమతి పొందడం చాలా తృప్తిని ఇస్తుంది’ అన్నారు. మరొక వినియోగదారు ‘గత కొన్ని సంవత్సరాలుగా అతను చేసిన కృషికి ఇది ప్రతిఫలం. అతనికి ఆల్ ది బెస్ట్’ అంటూ అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే..


