రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత అధికారిక పర్యటన కోసం భారత్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట వచ్చే అత్యంత భద్రతా ప్రమాణాలున్న కారు ‘ఆరుస్ సెనాట్’(Aurus Senat) గురించి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న ఈ సందర్శన రెండు దేశాల చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ‘రష్యన్ రోల్స్-రాయిస్’గా పిలువబడే ఆరుస్ సెనాట్ ప్రత్యేకతలను చూద్దాం.
పుతిన్ 2018 నుంచి ఉపయోగిస్తున్న ఈ సెనాట్ మోడల్‌ను రష్యన్ ఆటోమోటివ్ ఇంజిన్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. సోవియట్ కాలంలోని జీఐఎస్-110 లిమోజీన్‌ను పోలి ఉండే రెట్రో డిజైన్‌తో దీన్ని రూపొందించారు.
ఆరుస్ సెనాట్ ప్రత్యేకతలు
ఆరుస్ సెనాట్ కారును ప్రధానంగా మిలిటరీ గ్రేడ్ భద్రతా వ్యవస్థల కోసం తయారు చేశారు. ఇది ప్రతి వైపు 20 మిల్లీమీటర్ల మందం గల బుల్లెట్‌ప్రూఫ్ ఆర్మర్‌ను కలిగి ఉంటుంది. ఇది కాల్పులను సమర్థవంతంగా తట్టుకోగలదు. అంతేకాకుండా దీని ఫ్లోర్, డోర్స్ బ్లాస్ట్-రెసిస్టెంట్‌గా తయారు చేశారు. గ్రెనేడ్ వంటి పేలుళ్లను కూడా తట్టుకుంటుంది.
ఈ కారులో అత్యవసర వ్యవస్థలు కూడా ఉన్నాయి. దీనికి అమర్చిన ప్రత్యేకమైన రన్-ఫ్లాట్ టైర్స్ కారణంగా టైర్లు పంక్చర్ అయినప్పటికీ కారు 50 కిలోమీటర్ల దూరం వరకు సురక్షితంగా ప్రయాణించగలదు. ఇంకేదైనా రసాయన లేదా గ్యాస్ దాడి జరిగినప్పుడు ప్రయాణీకులకు సురక్షితమైన గాలిని అందించడానికి ఇందులో ఆక్సిజన్ సప్లై సిస్టమ్, అగ్ని ప్రమాదం నుంచి రక్షించడానికి ఫైర్ సప్రెషన్ సిస్టమ్ కూడా ఉన్నాయి.
భద్రతతో పాటు ఆరుస్ సెనాట్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది అద్భుతమైన 598 హార్స్ పవర్ కలిగి ఉండి, 880 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తితో భారీ కారు అయినప్పటికీ కేవలం 6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
భద్రతా ఫీచర్లతోపాటు కారు లోపల అత్యంత లగ్జరీ, అధునాతన టెక్నాలజీతో నిండి ఉంటుంది. ఇందులో ప్లష్ లెదర్ ఇంటీరియర్ పుతిన్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. హై-టెక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రిఫ్రిజిరేటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ప్రయాణాన్ని విలాసవంతంగా చేస్తాయి.
ఇదీ చదవండి: 300పైగా విమానాలు రద్దు.. ఆకాశాన్నంటిన ఛార్జీలు


