న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నాయకుల్లో ఒకరు. ఆయన ప్రతి కదలికలోనూ నిరంతర నిఘా ఉంటుంది. ఆయన చుట్టూ ఉండే ‘భద్రతా వలయం’ ఎప్పుడూ చర్చనీయాంశమే. డిసెంబర్ 4, 5 తేదీల్లో పుతిన్ భారతదేశ పర్యటనకు రానున్న నేపథ్యంలో, ఆయన భద్రతా ఏర్పాట్లు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఇంతటి పటిష్టమైన భద్రత మధ్య, ఆధునిక సాంకేతికతకు దూరంగా ఉండే పుతిన్ నిజంగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తారా? అనే ప్రశ్న ఆసక్తి కలిగిస్తుంది.
పుతిన్ స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉంటారని ఏఎఫ్‌పీ న్యూస్ నివేదించింది. 2018లో శాస్త్రవేత్తలతో జరిగిన ఒక సమావేశంలో అందరి జేబుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయని ఒక ప్రతినిధి ప్రస్తావించగా పుతిన్ వెంటనే స్పందిస్తూ, ‘నా దగ్గర స్మార్ట్‌ఫోన్ లేదు’ అని స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కూడా ధృవీకరించారు. ‘స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం అనేది ఆ వ్యక్తి గోప్యత, భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. ఇది ముఖ్యంగా ఉన్నత స్థాయి నేతలకు గొప్ప ప్రమాదాన్ని కలిగిస్తుంది’ అని పెస్కోవ్ స్పష్టం చేశారు. పుతిన్ తన అధికారిక నివాసమైన క్రెమ్లిన్ లోపల మొబైల్ ఫోన్‌లను పూర్తిగా నిషేధించారని కూడా చెబుతారు. ఆయన ఎవరితోనైనా సంభాషించాలంటే అధికారిక (సురక్షితమైన) ఫోన్ లైన్‌ను ఉపయోగిస్తారు.
పుతిన్ ఆధునిక సాంకేతికతపై అనాసక్తిని చాలాసార్లు వ్యక్తం చేశారు. 2017లో పాఠశాల పిల్లలతో మాట్లాడినప్పుడు, తాను ఇంటర్నెట్‌ను చాలా అరుదుగా ఉపయోగిస్తానని తెలిపారు. అంతేకాదు ఆయన ఇంటర్నెట్‌ను విమర్శిస్తూ, అది ‘సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ (సీఐఏ)కి చెందిన ప్రత్యేక ప్రాజెక్ట్. అందులో సగం అశ్లీలత ఉంటుందని వ్యాఖ్యానించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇంటర్నెట్‌కు అనుసంధానించే ఎలాంటి పరికరాలను లేదా గాడ్జెట్‌లను పుతిన్ విశ్వసించరు. మొబైల్ ఫోన్‌లకు ఆయన దూరంగా ఉండటమే కాకుండా, ఎప్పుడైనా అలాంటి పరికరాలు తనదగ్గరకు తీసుకువస్తే వాటిని దూరం పెట్టాలని ఆదేశిస్తారు. ఈ చర్యలన్నీ ఆయన తన భద్రత, సమాచార గోప్యతకు ఇచ్చే అత్యున్నత ప్రాధాన్యతను స్పష్టం చేస్తాయి.
పుతిన్ విదేశాలకు పర్యటించినప్పుడు, ఆయన భద్రతా బృందం తీసుకునే జాగ్రత్తలు మరింత పటిష్టంగా ఉంటాయి. ఆయన బస చేసే హోటల్, తినే ఆహారం వరకు ప్రతి ఒక్కటి ముందుగానే క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. విషప్రయోగం లేదా కలుషితం కాకుండా నిరోధించడానికి, ఆయనకు వడ్డించే ఆహారాన్ని ప్రత్యేకంగా పరీక్షిస్తారు. అంతేకాకుండా ఆయన బస చేసే ప్రాంతాలను కూడా భద్రతా సిబ్బంది పూర్తిగా శానిటైజ్ చేసి శుభ్రం చేస్తారు. ఈ అంశాలు సాంకేతికంగా వెనుకబాటును చూపుతున్నప్పటికీ, అత్యున్నత స్థాయి నేత భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో తెలియజేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: పుతిన్ సెక్యూరిటీ: ల్యాబ్, టాయిలెట్.. అంతా రహస్యమే!


