పొరుగు దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దాన్నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి రుణం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఏకంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)ను విక్రయించాలని నిర్ణయించింది. దశాబ్దాలుగా అవినీతి, నిర్వహణ లోపాలు.. ‘పైలట్ లైసెన్స్ కుంభకోణం’తో కుదేలైన పీఐఏను కొనుగోలు చేసేందుకు నలుగురు బిడ్డర్లు అర్హత పొందారు. అయితే ఈ రేసులో వివాదాల సర్వసైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ కూడా ఉండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి $7 బిలియన్ల(రూ. 63,220 కోట్లు) ఆర్థిక ప్యాకేజీని పొందేందుకు తన జాతీయ క్యారియర్ అయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)ని విక్రయించాలని నిర్ణయించుకుంది. రుణాలపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గుతూ ఈ నిర్ణయం తీసుకుంది. పీఐఏ విక్రయం అనేది గత రెండు దశాబ్దాలలో పాకిస్తాన్ చేసిన మొదటి అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రయత్నం కానుంది.
ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటన మేరకు పీఐఏ బిడ్డింగ్ 2025, డిసెంబర్ 23న ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం పీఐఏలోలో 51-100 శాతం వాటాను విక్రయించడం అత్యంత కీలకమైన షరతు. ఈ ఏడాది ఈ ప్రైవేటీకరణ ద్వారా రూ. 86 బిలియన్ల(రూ. 8,600 కోట్లు) ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ప్రైవేటీకరణ మంత్రి ముహమ్మద్ అలీ తెలిపారు.
కన్నింగ్ మునీర్ చేతికి..
ఈ విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో 15శాతం ప్రభుత్వానికి వెళ్తుంది. మిగిలినది కంపెనీ పునరుద్ధరణ కోసం ఉపయోగించనున్నారు.ఈ బిడ్డింగ్‌కు ముందస్తు అర్హత పొందిన నాలుగు సంస్థలలో, సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఒకటి. ఇది పాకిస్తాన్‌లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థలలో ఒకటైన ఫౌజీ ఫౌండేషన్‌లో భాగం. పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఫౌజీ ఫౌండేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ప్రత్యక్ష స్థానం లేదు. అయితే ఆయన క్వార్టర్‌మాస్టర్ జనరల్ (క్యూఎంజీ)నియామకం ద్వారా ఆయన ఈ సంస్థపై పరోక్ష ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. ఇప్పటికే మునీర్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వాన్ని పక్కన పడేసి తానే నెంబర్1గా, నియంతగా పాక్‌ను పాలించే యోచనలో ఉన్నాడని అక్కడి ప్రజలే మండిపడుతున్నారు. మరోపక్క పీటీఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మునీర్‌ను గుంటనక్కగా అభివర్ణిస్తూ.. పాక్‌ను నాశనం చేసేదాకా ఊరుకోడంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
నిండా ముంచిన పైలట్ లైసెన్స్ కుంభకోణం
పీఐఏ పతనానికి అనేక కారణాలున్నాయి. సంవత్సరాల తరబడి జరిగిన ఆర్థిక దుర్వినియోగం, అవినీతి, 2020లో పైలట్ లైసెన్స్ కుంభకోణం కారణంగా సంస్థ సంక్షోభంలో చిక్కుకుంది. 30 శాతం కంటే ఎక్కువ మంది పాకిస్తానీ పైలట్లు నకిలీ లైసెన్స్‌లు కలిగి ఉన్నారని తేలింది. దీంతో సంస్థ 262 మందిని తొలగించవలసి వచ్చింది. ఫలితంగా యూరోపియన్ యూనియన్, యూకే, యూఎస్‌లు పీఐఏ విమానాలపై నిషేధం విధించాయి. దీంతో పాక్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. అంతర్గత సమస్యలు కూడా పీఐఏను దెబ్బతీశాయి. సిబ్బందికి అధిక జీతాలు, ప్రయోజనాలు మొదలైనవి ఖర్చులను మరింతగా పెంచాయి. నిర్వహణ లోపాలతో పాటు, 2020లో జరిగిన పీఐఏ ఫ్లైట్ 8303 క్రాష్ వంటి భద్రతా వైఫల్యాలు సంస్థకు మరింత నష్టం కలిగించాయి. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టడానికి పాక్ చేస్తున్న ప్రయత్నాల్లో పీఐఏ విక్రయం అనేది కీలక చర్యగా పరిగణిస్తున్నారు.
ఇది కూడా చదవండి: గవర్నర్ మనవడిపై హత్యాయత్నం కేసు


