భోపాల్: కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కుటుంబం వరకట్న వేధింపుల ఆరోపణల్లో చిక్కుకుంది. గవర్నర్ మనవడు దేవేంద్ర గెహ్లాట్ భార్య దివ్య గెహ్లాట్, తన భర్తతో పాటు మామ, అతని కుటుంబంపై వరకట్న వేధింపులు, హత్యాయత్నం, గృహ హింస, తన మైనర్ కుమార్తె అపహరణ తదితర ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్‌కు దివ్య లిఖితపూర్వకంగా ఈ మేరకు ఫిర్యాదు చేశారు. రూ. 50 లక్షల కట్నం డిమాండ్ చేస్తూ, తన అత్తమామలు కొన్నేళ్లుగా తనను వేధిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
దివ్య ఆరోపణల ప్రకారం.. 2018, ఏప్రిల్ 29న వారి వివాహం జరిగింది. అయితే అంతకు ముందు తన భర్త దేవేంద్ర గెహ్లాట్ మద్యపానం, మాదకద్రవ్య వ్యసనంలో మునిగితేలేవాడని, ఇతర మహిళలతో సంబంధాలున్నాయని, అయితే అవి తనకు తెలియకుండా దాచిపెట్టాడని దివ్య ఆరోపించారు. తమ వివాహం ముఖ్యమంత్రి కన్యాదాన యోజన కింద సీనియర్ నేతలు మాజీ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, థావర్‌చంద్ గెహ్లాట్ తదితర ప్రముఖుల సమక్షంలో జరిగిందన్నారు. పెళ్లి తర్వాత కూడా దేవేంద్ర తన వ్యసనాలను మానుకోలేదని, ఇతర మహిళలతో సంబంధాలు కొనసాగించాడని దివ్య ఆరోపించారు.
2021లో తాను గర్భవతిగా ఉన్నప్పుడు వేధింపులు మరింత తీవ్రమయ్యాయని, తనకు ఆహారం ఇచ్చేవారు కాదని, తీవ్రంగా కొట్లేవారని, మానసికంగా హింసించారని దివ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జనవరి 26న తన భర్త తాగి వచ్చి, తనను దారుణంగా కొట్టి ‘ఈ రోజు డబ్బు తీసుకురాకపోతే చంపేస్తాను’ అని బెదిరించాడని, తరువాత పైనుంచి తోసేశాడని, దీంతో తన వెన్నెముక, భుజం, నడుముకు తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. పైగా ఆరోజు రాత్రంతా తనకు వైద్య సహాయం అందించలేదని ఆమె ఆరోపించారు.
గాయాలతో బాధపడుతున్న తనను మరుసటి రోజు ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ తన పరిస్థితిని గుర్తించి, ఇండోర్‌లోని బాంబే ఆసుపత్రికి తరలించారని దివ్య తెలిపారు. అయితే ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పలేదని, పైగా తన వైద్య ఖర్చులు భరించాలని తన తండ్రిపై ఒత్తిడి తెచ్చారని దివ్య ఆరోపించారు. తన నాలుగేళ్ల కుమార్తెను తన అత్తమామలు వారితోనే ఉంచుకున్నారని, తాను తన కుమార్తెను కలుసుకునేందుకు పాఠశాలకు వెళ్ళినప్పుడు, తన భర్త అడ్డుకొని, తన తల్లిదండ్రుల నుండి డబ్బు తీసుకువచ్చాకనే, కూతురిని చూడాలని హెచ్చరించాడని దివ్య ఆరోపించారు.
దివ్య ప్రస్తుతం రత్లంలో తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. ఈ ఉదంతంలోని పలు సంఘటనలు ఉజ్జయిని జిల్లాలోని నాగ్డాలో జరగడంతో, రత్లాం పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించి, తదుపరి చర్యల కోసం ఉజ్జయిని అధికారులకు పంపారు. ఈ ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గెహ్లాట్ (దివ్య మామ) స్పందించారు. ఆరోపణలు ఎవరైనా చేయవచ్చని, తను అన్ని వాస్తవాలను మీడియా ముందు ఉంచుతానని అన్నారు.
ఇది కూడా చదవండి: పుతిన్ సెక్యూరిటీ: ల్యాబ్, టాయిలెట్.. అంతా రహస్యమే!


