బెంగళూరు విధానసౌధలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం
నేడు డీకే ఇంట్లో సీఎం సిద్ధరామయ్యకు బ్రేక్‌ఫాస్ట్
మరోవైపు సీఎం మార్పుపై కొలిక్కిరాని హైకమాండ్ చర్చలు
సాక్షి, బెంగళూరు: అధికార మార్పిడి వివాదానికి అల్పాహార భేటీ ద్వారా విరామం ప్రకటించి ఐక్యతారాగం పాడిన సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి తమ ఐక్యతను చాటిచెప్పేందుకు సిద్ధమయ్యారు. మూడు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీఎం సిద్ధరామయ్య తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. ఇప్పుడు డీకే వంతు వచ్చింది. సోమవారం విధానసౌధలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ‘తన నివాసంలో భోజన విందుకు’ రావాల్సిందిగా సీఎంను డీకే ఆహ్వానించారు.
అయితే బ్రేక్‌ఫాస్ట్‌కు వస్తానని సీఎం తెలిపారు. దీంతో సీఎం సిద్ధరామయ్యకు ఇష్టమైన నాటుకోడి పులుసుతో పాటు ఇతరత్రా వంటకాలను ప్రత్యేకంగా డీకే సిద్ధం చేయిస్తున్నారు. కలిసి కూర్చుని మాట్లాడుకోవాలంటూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు ఈ నెల 29న ముఖ్యమంత్రి నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు తామిద్దరం కలసికట్టుగా సాగుతున్నట్లు మీడియాకు వివరించారు. తద్వారా సీఎం మార్పిడి వివాదానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు.
జనవరి మొదటి వారానికి వాయిదా!
కాగా, సీఎం మార్పుపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎటూ తేల్చకుండా నాన్చుతోంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ నాయకులు బిజీగా ఉండడంతో కర్ణాటక అధికార మార్పిడిపై చర్చించేందుకు అధిష్టానం నాయకులు అందుబాటులో లేరని తెలుస్తోంది. ఢిల్లీలో ఆదివారం సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కర్ణాటక రాజకీయ పరిస్థితి చర్చకువచ్చింది. సిద్ధరామయ్య, డీకేల కార్యాచరణపై వివరాలను అడిగి తెలుసుకున్న సోనియా జనవరి మొదటి వారంలో పరిశీలిస్తామని ఖర్గేకు తెలిపినట్లు సమాచారం.
మేం సోదర సమానులం: డీకే
ముఖ్యమంత్రి, తాను సోదర సమానులమని, కలసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు సాగుతామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మాజీ సీఎం దివంగత కెంగల్ హనుమంతయ్య వర్ధంతి సందర్భంగా విధానసౌధలోని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన శివకుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. తమలో గ్రూపులు మీడియా సృష్టి అన్నారు. రాజకీయ ద్వేషంతోనే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని నేషనల్ హెరాల్డ్ కేసును ఉదహరిస్తూ ఆయన పేర్కొన్నారు. డీకే ఇస్తున్న విందుకు వెళుతున్నట్లు ఇదే కార్యక్రమం సందర్భంగా సీఎం తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు ప్రస్తావిస్తూ సోనియా, రాహుల్ గాందీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం సరికాదన్నారు.


