ఇరుసభల్లో ఎస్‌ఐఆర్‌పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు
ఇప్పటికిప్పుడు కుదరదన్న అధికారపక్షం
నినాదాలతో వేడెక్కిన శీతాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే విపక్షాల ఆందోళనతో లోక్‌సభ అట్టుడికింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వేపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. అందుకే లోక్‌సభ స్పీకర్ నిరాకరించడంతో విపక్షసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పలు మార్లు లోక్‌సభ వాయిదాపడింది.
నివాళులతో మొదలై నినాదాలతో కొనసాగి..
అంతకుముందు సోమవారం ఉదయం 11 గంటలకు జాతీయగీతం జనగణమనతో లోక్‌సభలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతిచెందిన మాజీ సభ్యులకు ప్రస్తుత లోక్‌సభ సభ్యులు నివాళిగా సంతాపం తెలిపారు. అనంతరం స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెనువెంటనే కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీసహా పలు విపక్ష పార్టీల ఎంపీలు తమతమ స్థానాల్లోంచి లేచారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర(ఎస్‌ఐఆర్) సర్వే అంశంపై లోక్‌సభలో చర్చించాలని పట్టుబట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభాకార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ ఓంబిర్లా వెంటనే కల్పించుకున్నారు. ‘తొలిరోజే సభాకార్యకలాపాలకు అడ్డుతగలడం ఏమాత్రం మంచి పధ్దతి కాదు. సభలో విధానాత్మక, నిర్మాణాత్మక చర్చలు జరగాలి. సభలో సమ్మతి, అసమ్మతి రెండు ఉన్నా, చర్చల ద్వారానే అన్నింటికీ సమాధానం దొరుకుతుంది.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ను నినాదాలతో అడ్డుకోకూడదు. ప్రశ్నోత్తరాలు కొనసాగనివ్వండి’’ అని స్పీకర్ అన్నారు. అయినప్పటికీ విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకుండా, ఎస్‌ఐఆర్‌పై చర్చను కోరుతూ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక సైతం విపక్ష సభ్యుల వైఖరితో మార్పు రాలేదు. విపక్షాల ఆందోళన ఎక్కువవడంతో కేవలం 12 నిమిషాల తర్వాత సభ మళ్లీ వాయిదాపడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ మళ్లీ మొదలైంది.
బిల్లులను ప్రవేశపెట్టిన సీతారామన్
పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సయిజ్ డ్యూటీ, పాన్ మసాలాపై కొత్త సెస్ వేసేందుకు ఉద్దేశించిన బిల్లుతోపాటు, సెంట్రల్ ఎక్సయిజ్(సవరణ) బిల్లు–2025, హెల్త్‌సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు–2025లను ఈలోపే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మణిపూర్‌లో రాష్ట్రపతిపాలన కొనసాగుతుండటంతో మణిపూర్ జీఎస్‌టీ(సవరణ) బిల్లును సైతం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. 2025–26 ఆర్థికసంవత్సర గ్రాంట్లకు సంబంధించిన అనుబంధ పద్దును సైతం సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తర్వాత సభ మరోసారి వాయిదాపడింది. తర్వాత సభ మొదలైనా విపక్ష సభ్యుల నినాదాలు ఆగలేదు. దీంతో చేసేదిలేక స్పీకర్ మధ్యాహ్నం 2.20 గంటలకు సభను మంగళవారానికి వాయిదావేశారు.
రాజ్యసభలోనూ..
ఎగువసభలోనూ దాదాపు ఇవే దృశ్యాలు కనిపించాయి. ఎస్‌ఐఆర్‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ‘‘ఎస్‌ఐఆర్‌పై చర్చకు ప్రభుత్వం వెనుకడుగు వేయట్లేదు. అయితే నిరీ్ణత కాలావధిలోపు ఫలానా సమయంలోనే చర్చించాలనే మొండిపట్టును విపక్షాలు విడనాడాలి. ఎస్‌ఐఆర్‌పై చర్చ అంశంలో కేంద్రానికి మరింత సమయం కావాలి’’ అని ఆయన అన్నారు.
మంత్రి సమాధానంతో సంతృప్తిచెందని విపక్ష సభ్యులు వెనువెంటనే రాజ్యసభ నుంచి వాకౌట్‌చేశారు. అంతకుముందు ఎస్‌ఐఆర్‌సహా పలు అంశాలపై తక్షణం చర్చ జరపాలంటూ తొమ్మిది మంది విపక్ష సభ్యులు వేర్వేరుగా రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు నోటీస్‌లను అందజేశారు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణంచేశాక రాజ్యసభ డిప్యూటీచైర్మన్ హోదాలో రాధాకృష్ణన్ సేవలందించడం ఇదేతొలిసారికావడం విశేషం. ఈ సందర్భంగా ఆయనను ప్రధాని మోదీ పొగిడారు.
‘‘సాధారణ కుటుంబం నుంచి వచి్చన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదగడం మన ప్రజాస్వామ్యంలోని శక్తికి నిదర్శనం. పలు రాష్ట్రాల్లో కీలక పదవుల్లో సేవచేసి గడించిన అనుభవం రాజ్యసభ సజావుగా సాగేందుకు తోహదపడనుంది’’ అని ఆయన అన్నారు. తర్వాత ఖర్గే మాట్లాడారు. ‘‘ గత ఉపరాష్ట్రపతి హఠాత్తుగా రాజీనామాచేయడం అధికార పక్షాన్ని సైతం విస్మయపరిచింది. రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య సమతూకం పాటిస్తూ విపక్ష సభ్యులకు సైతం సమస్యలపై మాట్లాడే అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేస్తున్నా’’ అని ఖర్గే అన్నారు.


