రుణగ్రహీతల్లో 46% మంది ఈ కోవలోకే
క్రమంగా పెరుగుతున్న వ్యాపార రుణాలు
మూడింట రెండొంతులు మొబైల్ బ్యాంకింగ్
భారత్‌లో గత ఏడాది 15.1 కోట్ల స్మార్ట్‌ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి కొత్తగా వచ్చి పడ్డాయి. ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ మధ్య.. అంటే తొమ్మిది నెలల్లో దాదాపు 12 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇంత భారీస్థాయిలో వీటి విక్రయాలు జరగడానికి ప్రధాన కారణం సులభంగా రుణాలు దొరకడమే. ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ కోసమే అత్యధికులు లోన్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సెప్టెంబర్ నాటికి దేశంలో రిటైల్ లోన్స్ మొత్తం రూ.156.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ఏడాదిలో వీటి విలువ ఏకంగా 18% పెరిగిందంటే జనం ఏ స్థాయిలో అప్పులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 67 కోట్ల యాక్టివ్ రుణ ఖాతాలున్నాయి. ఈ ఖాతాల సంఖ్య సంవత్సరంలో 7.1% దూసుకెళ్లింది. కన్జ్యూమర్ ఫైనాన్స్ కంపెనీ హోమ్ క్రెడిట్ ఇండియా 2025లో భారతీయుల రుణాల తీరుపై ఓ నివేదికను రూపొందించింది. ఈ ఏడాది రుణగ్రహీతల్లో 46% మంది స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకే అప్పు చేశారని వెల్లడించింది. 25% మంది కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి రుణం అందుకున్నారని తెలిపింది.
ఆర్థిక లక్ష్యాల సాధనకు..
అవసరానికి అప్పు తీసుకోవడం గతం. ఇప్పుడు జనం తీరు మారింది. ఆకాంక్షలు, స్వావలంబనకు పెద్దపీట వేస్తున్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, వ్యాపారంలో పెట్టుబడి, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి రుణాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది వారి వ్యూహాత్మక, భవిష్యత్తుకు బాటలు వేసే మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని అధ్యయనం తెలిపింది. దేశంలో అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి వారి ఆకాంక్షలను, కలలను వాస్తవంగా మార్చడానికి స్మార్ట్ క్రెడిట్‌ను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారని వివరించింది. హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా 17 ప్రధాన నగరాల నుంచి సగటు కుటుంబ ఆదాయం నెలకు రూ.33,923 కలిగిన 18–55 ఏళ్ల వయసున్న వ్యక్తులు సర్వేలో పాలుపంచుకున్నారు.

తమ కాళ్లమీద తాము..
రుణాల తీరును చూస్తుంటే తమ కాళ్లమీద తాము నిలబడాలన్న ఆలోచన జనంలో పెరిగింది. వ్యాపారం ప్రారంభించేందుకు, ప్రస్తుత బిజినెస్‌ను విస్తరించేందుకు రుణం అందుకున్నవారు 2022లో 14% మాత్రమే. ఆ తర్వాతి సంవత్సరాల నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ 2023లో 19%, గత ఏడాది 21% నమోదైంది. ఈ ఏడాది ఇది 25 శాతానికి పెరిగింది.
చిన్న నగరాల్లో జోరుగా..
రుణాలు తీసుకున్నవారిలో 65 శాతం మంది మొబైల్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు, సేవలు అందుకుంటున్నారు. మొబైల్ బ్యాంకింగ్‌లో మిల్లీనియల్స్ (1981–1996 మధ్య పుట్టినవారు) ముందున్నారు. అలాగే మెట్రో సిటీస్ అత్యధిక విస్తృతి కలిగి ఉన్నాయి. ప్రథమ శ్రేణి నగరాలతో పోలిస్తే ద్వితీయ శ్రేణి నగరాల్లోని రుణగ్రహీతలు అధికంగా మొబైల్ బ్యాంకింగ్‌కు అలవాటు పడటం గమనార్హం. మొత్తంగా ఆన్‌లైన్ లెండింగ్ కంపెనీల నుంచి రుణం పొందడానికి 49 శాతం మంది మొగ్గుచూపుతున్నారు.