వీరన్న కుటుంబాన్ని ఆదుకునేదెవరు?: హరీష్‌రావు | BRS Harish Rao Demands Revanth Govt To Help Farmer Veeranna Family | Sakshi
Sakshi News home page

వీరన్న కుటుంబాన్ని ఆదుకునేదెవరు?: హరీష్‌రావు

Dec 1 2025 1:23 PM | Updated on Dec 1 2025 1:23 PM

BRS Harish Rao Demands Revanth Govt To Help Farmer Veeranna Family

సాక్షి, హైదరాబాద్‌: కౌలు రైతులకు భరోసా ఇస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ.. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించిందని బీఆర్‌ఎస్‌​ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. ఖమ్మం రైతు బానోతు వీరన్న ఉదంతంపై తాజాగా ఆయన ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. 

నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న బలవన్మరణం చెందడం అత్యంత బాధాకరం. పండించిన పంటకు ధర రాక.. అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అంటూ పురుగుల మందు తాగుతూ వీరన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు ఓ నిదర్శనం.

వీరన్నది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యనే. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ. 15,000 రైతుభరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గం. పండించిన పంటను కొనే దిక్కులేక, మద్దతు ధర రాక, దళారుల దోపిడీకి రైతులు బలవుతున్నారు. 

సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ఈ ప్రభుత్వానికి  చలనం వస్తుందా? ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారు?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని చేతులు జోడించి విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం.. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే.. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి... ఎవరూ అధైర్యపడకండి అంటూ హరీష్‌రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement