డిచ్‌పల్లి మండలంలోని ఓ గ్రామ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ ఈ సారి తన భార్యను బరిలోకి దించుతున్నా రు. సర్పంచ్‌గా కాకుండా తన భార్యతో కలిసి వార్డు మెంబర్‌గా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇద్దరూ గెలిస్తే ఉప సర్పంచ్ పదవి దక్కించుకునేలా ప్రణాళి క రూపొందిస్తున్నాడు. అందుకోసం తన కు అనుకూలమైన వార్డును వెతుక్కుని ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించాడు.
రిజర్వేషన్‌ల కారణంగా సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం కోల్పోయిన చోట ఉప సర్పంచ్ పదవినైనా కైవసం చేసుకోవాలనే యోచనలో కొందరు నాయకులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్‌లు ఉన్న గ్రామాల్లో ఉప సర్పంచ్‌గా ఎన్నికైతే ఆ పంచాయతీల్లో ఎంతోకొంత పెత్తనం కొనసాగుతుందనే ఆలోచనతో వార్డు సభ్యుల మద్దతును కూడగట్టుకుంటున్నారు.
డిచ్‌పల్లి/మోర్తాడ్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవికి డిమాండ్ పెరిగింది. సర్పంచ్ రిజర్వేషన్ తమకు అనుకూలంగా రాని గ్రామాల్లో చక్రం తిప్పే నాయకులంతా ఇప్పుడు ఉప సర్పంచ్ పదవిపై దృష్టి సారించారు. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతోపాటు మహిళలకు 50శాతం సర్పంచ్ స్థానాలు రిజర్వ్ కావడంతో చాలా మంది కీలకనాయకులకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో వారంతా ఉప సర్పంచ్ పదవి కోసం రంగంలోకి దిగుతున్నారు. సర్పంచ్ స్థానం మహిళలకు రిజర్వు అయిన చోట్ల తమ భార్యలను బరిలోకి దింపి తాము వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
రిజర్వేషన్‌లు ఇలా..
జిల్లాలో 545 సర్పంచ్ స్థానాలు ఉండగా.. 129 – అన్‌రిజర్వ్‌డ్ (జనరల్), 113 – అన్ రిజర్వ్‌డ్ (మహిళ), 70 – బీసీ (జనరల్), 55– బీసీ (మహిళ), 47 – ఎస్సీ (జనరల్), 35 – ఎస్సీ (మహిళ), 55 – ఎస్టీ (జనరల్) (వందశాతం ఎస్టీ జనాభా క లుపుకుని), 41 – ఎస్టీ (మహిళ) (వందశాతం ఎస్టీ జనాభా కలుపుకుని) రిజర్వ్ అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ స్థానాలతోపాటు మహిళలకు రిజర్వ్ అయిన స్థానాల్లో ఉప సర్పంచ్ పదవులకు డిమాండ్ పెరిగింది. చోటామోటా నేతలంతా ఉప సర్పంచ్ పదవి కోసం రంగంలోకి దిగుతున్నారు. బీసీలకు 125 స్థానాలుండగా వాటిలో 55 మహిళలకు కేటా యించారు. ఇన్నాళ్లు ఆశలు పెంచుకున్న బీసీ జనరల్ అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం లేకుండా పో యింది. దీంతో ఉప సర్పంచ్ పదవిపై కన్నేసిన నాయకులు గెలుపు కోసం బరిలోకి దిగుతున్నారు. అలాగే జిల్లాలో 113 స్థానాలు మహిళ (అన్ రిజ ర్వుడ్)కు కేటాయించడంతో ఆయా స్థానాల్లో సైతం ఉప సర్పంచ్ పదవులకు డిమాండ్ పెరిగింది.
చెక్‌పవర్ ఉంటే పెత్తనం చెలాయించవచ్చనే..!
ఉప సర్పంచ్‌లకు సైతం చెక్ పవర్ ఉండడంతో ఈ పదవికి డిమాండ్ పెరిగింది. మహిళలు సర్పంచ్‌లుగా ఉన్నచోట్ల పెత్తనం చలాయించడానికి ఉప సర్పంచ్ పదవి ఎంతో అనుకూలమనే భావనలో కొందరు నాయకులు ఉన్నారు. దీంతో సర్పంచ్ పదవికి పోటీ చేసే అవకాశం దక్కని వారు ఉప సర్పంచ్ పదవిపై కన్నేసి పావులు కదుపుతున్నారు.


