నాడు సర్పంచ్‌... నేడు దినసరి కూలీ | Narsannapalli Sarpanch Ellayya’s story | Sakshi
Sakshi News home page

నాడు సర్పంచ్‌... నేడు దినసరి కూలీ

Dec 1 2025 11:08 AM | Updated on Dec 1 2025 11:08 AM

 Narsannapalli Sarpanch Ellayya’s story

ప్రజా ప్రతినిధిగా చేసినా మారని తలరాత

ఉపాధి చూపి ఆదుకోవాలని వేడుకుంటున్న సర్పంచ్‌ 

కామారెడ్డి రూరల్‌: కుల వృత్తి చేసుకుంటూ జీవించే వ్యక్తి ఓ గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ప్రజాసేవే ధ్యేయంగా పనిచేసి ఉన్న కుల వృత్తిని వదిలేసి నేడు దినసరి కూలీగా మారాడు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఓ సర్పంచ్‌ దీనగాథ. ప్రస్తుతం డబ్బులు లేనిదే రాజకీయాల్లోకి రావడం సాధ్యంకాదు. డబ్బు లేకపోతే ఆ నాయకునికి విలువే లేదు. ఇక ఒక పదవి వచ్చాక ఆ నాయకుడు సంపాదించుకునే తీరే వేరు.

 ఒకసారి సర్పంచ్‌ అయితే ఒక తరం బతికేయొచ్చు అనుకుంటున్న నేతలున్న ఈ రోజుల్లో ఐదేళ్లు సర్పంచ్‌గా కొనసాగినా చిల్లి గవ్వ కూడా వెనకేసుకోకుండా ప్రభుత్వం కట్టించిన డబుల్‌ బెడ్‌రూంలో ఉంటూ రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. నర్సన్నపల్లిలో 2014లో ఎస్టీ సామాజిక వర్గానికి సర్పంచ్‌ స్థానం రిజర్వేషన్‌ వచ్చింది. గ్రామానికి చెందిన కుర్ర ఎల్లయ్య అనే వ్యక్తి పందులను మేపుతూ జీవనాన్ని సాగిస్తుండేవాడు. గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఐదేళ్లు సర్పంచ్‌ పదవిలో ఉన్నాడు. నిజా యితీగా ప్రజల కోసం పనిచేశాడు. పదవీకాలం సమయంలో చిల్లి గవ్వ కూడా సంపాదించుకోలేదు. 

అంతేకాకుండా సర్పంచ్‌గా పని చేస్తూ పందులను మేపుతుండడంతో అధికారులు(హోదా) హుందాగా బతకాలని సూచించడంతో ఉన్న పందులను అమ్మి వేశాడు. నివసించడానికి పూరి గుడిసెలోనే ఐదేళ్లు జీవనం సాగించాడు. అప్పటి సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు పేదవారికి కట్టించగా ఎల్లయ్యకు కూడా ఇచ్చారు. ఈ ఒక్కటి తప్ప తన పదవిలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఏదీ సంపాదించుకోలేదు. ప్రస్తుతం వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనతో పాటు పని చేసిన సర్పంచ్‌లు అందరూ ఎంతో కొంత కూడబెట్టుకొని నేడు దర్జాగా బతుకుతున్నారని, తాను మాత్రం సర్పంచ్‌ కంటే ముందు ఎలా ఉన్నానో సర్పంచ్‌ పదవి అయిపోయాక కూడా అలాగే ఉన్నానని పేర్కొన్నారు. ఉపాధి చూపించి ఆదుకోవాలని ఆయన వేడుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement