హైదరాబాద్ : ఓ చిన్నారిని పాఠశాలలో పని చేస్తున్న ఆయా విచక్షణారహితంగా కొట్టిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారిని ఆయా కొడుతున్న వీడియో వెలుగులోకి రావడంతో హాట్ టాఫిక్‌గా మారింది. ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన సంతోషి , కాలియో దంపతులు ఆరు నెలల క్రితం నగరానికి వచ్చి షాపూర్‌నగర్‌లోని పూర్ణిమ స్కూల్‌లో ఉంటున్నారు. సంతోషి ఆయాగా పనిచేస్తుండగా సంతోష్ ఓ అట్టల పరిశ్రమలో పనిచేస్తున్నాడు.
అదే పాఠశాలలో సంతోషి కుమార్తె (4) నర్సరీ చదువుతోంది. శనివారం మధ్యాహ్నం అదే పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న లక్ష్మి చిన్నారిని మూత్రశాల వద్దకు తీసుకువచి్చంది. అనంతరం చిన్నారిని దుస్తులు మార్చుకోవాలని ఆయా చెప్పగా చిన్నారి మార్చుకోలేక పోవడంతో ఆగ్రహానికి లోనైన ఆయా లక్ష్మి చిన్నారిని చితకబాదింది. చిన్నారి జుట్టు పట్టి కొట్టింది చిన్నారి ఏడుపు విన్న పక్కింటి యువకుడు ఈ ఘటనను వీడియో తీశాడు. సదరు వీడియో వైరల్ కావడంతో చిన్నారి తల్లిదండ్రులు జీడిమెట్ల పీఎస్‌లో పిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు పాఠశాల ఆయాతో పాటు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.


