మంగళూరులో నినాదాల మంటలు
కేసీ వేణుగోపాల్ ఎదుట గళమెత్తిన డీకే వర్గం
అనంతరం సిద్ధరామయ్య మద్దతుదారుల నినాదాలు
సాక్షి బెంగళూరు/శివాజీనగర: కర్ణాటకలో అధికార మార్పిడి వివాదం ఇంకా సద్దుమణిగినట్లు కనబడటంలేదు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ‘బ్రేక్‌ఫాస్ట్ చర్చలతో’ ఈ వివాదానికి బ్రేకులు పడ్డాయని సంకేతాలు ఇచ్చినా వారి మద్దతుదారులు వెనక్కు తగ్గడం లేదు. తాజాగా మంగళూరు విమానాశ్రయం ఇరువర్గాల బలప్రదర్శనకు వేదికగా మారింది.
విమానాశ్రయం వేదికగా...
కోణాజెలో నారాయణ గురు–మహాత్మా గాంధీ సంవాద శతమానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీ నుంచి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంలో డీకే అనుచర నాయకుడు మిథున్ రై, వందలాది మందితో కలిసి ‘డీకే.. డీకే..’ అంటూ వేణుగోపాల్ వద్ద నినాదాలు చేస్తూ దూసుకువచ్చారు. అయితే వేణుగోపాల్ మౌనంగా ముందుకు సాగారు.
కొన్ని నిమిషాల అనంతరం ఇదే కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో పలువురు మంత్రులతో కలిసి మంగళూరు చేరుకున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ ఐవన్ డిసోజా నేతృత్వంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకుని ముఖ్యమంత్రికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఆసక్తి రేపిన సీఎం–కేసీ విందు చర్చలు
కోణాజెలో కార్యక్రమం అనంతరం సిద్ధరామయ్య, వేణుగోపాల్ నడుమ మంగళూరు కావేరి గెస్ట్‌హౌజ్‌లో ‘లంచ్ మీటింగ్’ జరిగింది. అరగంట పాటు భోజనం చేస్తూ వారిద్దరూ పలు రాజకీయ, పార్టీ అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. భోజనానికి ముందు కూడా 15 నిమిషాల పాటు హైఓల్టేజ్ చర్చ కూడా వీరిద్దరి మధ్య జరిగిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అల్పాహార సమావేశాల్లో శివకుమార్, తన మధ్య జరిగిన చర్చలను, తీసుకున్న నిర్ణయాలను వేణుగోపాల్‌కు సీఎం వివరించినట్లు తెలిసింది. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ వేణుగోపాల్‌తో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదన్నారు. తాను ఢిల్లీకి వెళ్లడం లేదని, తనను ఎవరైనా పిలిస్తే మాత్రం వెళతానని వెల్లడించారు. డీకే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న విషయంపై అడిగిన ఒక ప్రశ్నకు స్పందిస్తూ, ‘అందులో తప్పేం ఉంది?’ అని ప్రశ్నించారు.
అభిమానుల నినాదాలు సహజమే: డీకే
ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన డీకే.. మంగళూరు పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ‘వేణుగోపాల్‌తో తమ నాయకుడు సిద్ధరామయ్య మాట్లాడితే తప్పేంటి? వేణుగోపాల్, రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గే ఇలా ఎవరినైనా కలిస్తే తప్పేంటి?’ అని ప్రశి్నంచారు. అలాగే విమానాశ్రయంలో తనకు అనుకూలంగా మద్దతుదారులు నినాదాలు చేయడంపై ఆయన మాట్లాడుతూ అభిమానులు తమ నాయకుడి పక్షాన నినాదాలు చేయడం చాలా సహజమన్నారు.


