మహిళా విలేకరిపై సిద్ధరామయ్య సరదా కామెంట్
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాల నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. అల్పాహార సమావేశాలు పూర్తి చేశారు. అధిష్టానం ఆదేశాలతో ఇరువురు నేతలు ఒకరికొకరు విందులు ఇచ్చుకున్నారు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. మంగళవారం ఉదయం శివకుమార్ ఇంటికి సిద్ధరామయ్య బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చారు. బెంగళూరు సదాశివనగరలోని తన ఇంటికి వచ్చిన ముఖ్యమంత్రికి డీకేశి సాదర స్వాగతం పలికారు. ఆయనకు ఎంతో ఇష్టమైన నాన్‌వెజ్ వంటకాలతో అల్పహార విందు ఇచ్చారు. తమ మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేవన్న సందేశం ఇచ్చేందుకు ఇరువురు నేతలు ప్రయత్నించారు. తామిద్దరం "సోదరులం" అని పదే పదే చెప్పుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని నొక్కి చెప్పారు.
కోడిగుడ్డు కూడా తినరా?
దాదాపు గంటపాటు బ్రేక్‌ఫాస్ట్ భేటీ సాగింది. శివకుమార్ సతీమణి ఉష స్వయంగా తయారు చేసిన వంటకాలను సిద్ధరామయ్య రుచి చూశారు. సాంప్రదాయ మైసూరు శైలిలో చేసిన నాటుకోడి పులుసు, ఇడ్లీ ఆరగించారు. శివకుమార్ మాత్రం శాఖాహార వంటకాలతో సరిపెట్టుకున్నారు. కాగా, ఊరి నుంచి నాటుకోడి (Natu Kodi) తెప్పించాలని డీకేశిని తానే కోరినట్టు సిద్ధరామయ్య స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ వెజిటేరియన్ మహిళా విలేకరిపై సీఎం సిద్ధరామయ్య తనదైన శైలిలో చేసిన వ్యాఖ్య అందరి దృష్టిని ఆకర్షించింది.
''మీకు చికెన్ అంటే ఇష్టమా'' అని మహిళా విలేకరిని సిద్ధరామయ్యగా ప్రశ్నించగా.. తాను స్వచ్ఛమైన శాఖాహారిని (Pure Vegetarian) అంటూ సమాధానం ఇచ్చారు. "స్వచ్ఛమైన" అంటే ఏమిటి, కనీసం కోడిగుడ్డు కూడా తినరా అని మళ్లీ ఆయన ప్రశ్నించగా.. 'లేదు' అంటూ జవాబిచ్చారామె. అయితే ''మీరు జీవితంలో ఏదో కోల్పోతున్నారు'' అంటూ సిద్ధరామయ్య తనదైన శైలిలో సరదాగా కామెంట్ చేయడంతో అక్కడున్నవారంతా నవ్వేశారు.
పిలిస్తే నేనూ వెళ్లేవాడిని: పరమేశ్వర
సిద్ధరామయ్య, శివకుమార్ బ్రేక్‌ఫాస్ట్ భేటీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర స్పందించారు. తనను కూడా పిలిచివుంటే అల్పహార విందుకు వెళ్లేవాడినని అన్నారు. వారిద్దరికీ కలిపి తానే విందు ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, తామంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్పారు. కాగా, ముఖ్యమంత్రిని మార్చాలని అధిష్టానం భావిస్తే తాను కూడా రేసులో ఉంటానని పరమేశ్వర ఇంతకుముందు అన్నారు. గతంలో తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
చదవండి: డీకే సీఎం అవుతారు.. అధిష్టానం నిర్ణయిస్తే!
సిద్ధూ ప్రిపేర్ అయ్యారా?
డీకేశితో బ్రేక్‌ఫాస్ట్ భేటీ (Breakfast Meeting) ముగిసిన తర్వాత సిద్ధరామయ్య మాటల్లో కొంచెం మార్పు కనిపించింది. అంతకుముందు వరకు ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఐదు బడ్జెట్లు తానే ప్రవేశపెడతానని దీమగా ప్రకటించిన ఆయన.. అధిష్టానం నిర్ణయించినప్పుడు డీకే శివకుమార్ సీఎం అవుతారని అన్నారు. పదవులు శాశ్వతం కాదన్న వేదాంత ధోరణిలోనూ ఆయన మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా పాటించడానికి ఆయన మానసికంగా సిద్ధమయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Hosted the Hon’ble CM for breakfast at my residence today as we reaffirm our commitment to good governance and the continued development of our state under the Congress vision. pic.twitter.com/qmBxr50S64
— DK Shivakumar (@DKShivakumar) December 2, 2025


