ముఖ్యమంత్రి పదవి మార్పిడి రగడను అల్పాహార విందుల ద్వారా పరిష్కరించుకునేలా కాంగ్రెస్ నాయకత్వం.. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లను ఆదేశించింది. ఫలితమే వరుసగా జరుగుతున్న బ్రేక్‌ఫాస్ట్ భేటీలు. అందరికీ నోరూరేలా పలు రకాల వంటకాలతో వారి సమావేశాలు జరుగుతూ రచ్చను చల్లార్చే ప్రక్రియలుగా రూపాంతరం చెందాయి.
బెంగుళూరు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మూడురోజుల కిందట అల్పాహార విందును ఆతిథ్యమిచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. ఇప్పుడు తానే అతిథిగా మారారు. ఈదఫా డీకే విందు ఇవ్వబోతున్నారు. ఇందులో సిద్దుకు ఇష్టమైన నాన్ వెజ్ ఉండే వీలుంది. మంగళవారం ఉదయం సదాశివనగరలోని డీసీఎం నివాసంలో జరగబోయే ఈ విందు సమావేశం ఉత్కంఠ పుట్టిస్తోంది. సిద్దరామయ్య ఇంట విందులో ఇద్దరూ ఐక్యతను ప్రదర్శించి, కుర్చీ రగడకు విరామం ఇచ్చినట్లు చాటుకున్నారు. ఇది ఫలించినట్లుగా ఉందనుకున్న హైకమాండ్ తిరుగు విందు ఇవ్వాలని డీకేశిని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నెల 8 నుంచి బెళగావిలోని సువర్ణసౌధ భవనంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభం కాబోతున్నాయి. ప్రతిపక్షాలకు కుర్చీ మారి్పడి గందరగోళం ఆయుధం కాకూడదని సీఎం, డీసీఎం తీర్మానించారు.
హైకమాండ్ ఆవరణలో బంతి..
గత 15 రోజుల నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌లో సీఎం సీటు తగాదా తారాస్థాయికి చేరింది. హైకమాండ్ మనసులో ఏముందో బయట పెట్టకుండా సామరస్య పరిష్కారానికి సూచనలు చేస్తోంది. మీరిద్దరే కూర్చొని చర్చించుకొని ఓ తీర్మానానికి వచ్చి ఆ తరువాత ఢిల్లీకి రండని సూచించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో సీఎం, డిప్యూటీ సీఎం విందు భేటీల ద్వారా తమ టాసు్కలను పూర్తి చేస్తుండగా, ఢిల్లీలో హైకమాండ్ తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. సోనియాగాం«దీ, రాహుల్‌గాందీకి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇక్కడి పరిణామాలను వివరించి, త్వరగా పరిష్కారం కనుగొనాలని కోరారు. సోనియా, రాహుల్ త్వరలోనే ఇద్దరినీ పిలిపించుకొని కార్యాచరణను తెలియజేస్తారని కాంగ్రెస్ ఉన్నత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు వారంలో మొదలవుతాయి, ఆ తరువాత హైకమాండ్ నిర్ణయం వెలువరిస్తుందని సమాచారం.


