మున్సిపాలిటీల్లో రెండున్నర వేల కోట్ల స్కామ్‌ | Scam of two and a half thousand crores in municipalities at Telangana | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీల్లో రెండున్నర వేల కోట్ల స్కామ్‌

Feb 3 2026 5:01 AM | Updated on Feb 3 2026 5:01 AM

Scam of two and a half thousand crores in municipalities at Telangana

చార్జిషీట్‌ విడుదల చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు. చిత్రంలో ఎంపీ ఈటల, మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ అశిష్‌ షెలార్‌ తదితరులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపణ

కీలక శాఖల వైఫల్యంతో సీఎం రేవంత్‌ కూడా విఫలం 

ప్రజలకు ఏ మేలు చేయని కాంగ్రెస్‌ ప్రభుత్వం 

రేవంత్‌కు మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదు 

‘బూటకపు హామీలు – మోసపూరిత వాగ్దానాలు’పేరిట చార్జిషీట్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రెండున్నర వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ఎన్నికలు జరగనున్న 7 కార్పొరేషన్లతో పాటు, మిగతా మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నా అవి అభివృద్ధి పనులకు ఖర్చుచేయకుండా ఎక్కడికి వెళుతున్నాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పట్టణాలు, నగరాల అభివృద్ధి, మౌలిక వసతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక నగరాల్లో, మరీ ముఖ్యంగా ప్రజల బతుకుల్లో మార్పులొచ్చాయా? అని ప్రశ్నించారు. సోమవారం టూరిజం ప్లాజాలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి అశిష్‌ షెలార్, సహ ఇన్‌చార్జి అశోక్‌ పర్ణామి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.గౌతమ్‌ రావు, మీడియా ఇన్‌చార్జి ఎన్వీ సుభాష్‌లతో కలిసి రామచందర్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై చార్జిషీట్‌ను విడుదల చేశారు. 

‘బూటకపు హామీలు – మోసపూరిత వాగ్దానాలు’పేరిట కాంగ్రెస్‌ అరాచక, అవినీతి పాలనపై బీజేపీ చార్జిషీట్‌ అంటూ ప్రకటించారు. ఈ సందర్భంగా రాంచందర్‌ రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అమలు కాని హామీలు, ప్రజలకు చేసిన మోసాలను ఎత్తిచూపేందుకే ఈ చార్జిషీట్‌ను రాష్ట్ర బీజేపీ విడుదల చేస్తోందన్నారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు, పథకాలు తీసుకురావడంతో పాటు పురపాలికల్లో అవినీతిరహిత, సమర్థవంతమైన పాలనను అందిస్తామని హామీనిస్తున్నామన్నారు. 

గతంలో బీఆర్‌ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్‌కు అవకాశమిచ్చినందున, ఇప్పుడు బీజేపీకి అవకాశమిస్తే పట్టణాల్లో అన్ని విధాలుగా మార్పు తీసుకొచ్చి చూపుతామన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌ రెడ్డి వద్దనున్న హోం, మున్సిపల్, విద్య వంటి కీలక శాఖలు పూర్తిగా విఫలం కావడంతో సీఎం కూడా పాలనలో వైఫల్యం చెందారన్నారు. ఒక మంత్రికి మరో మంత్రికి పడదని, కలెక్షన్లు, కమీషన్లతో మునిగితేలుతున్నారని ఆరోపించారు. బొగ్గు కుంభకోణం, టెండర్లలో అక్రమాలు తదితరాలతో, కాంగ్రెస్‌ సర్కార్‌ 40 శాతం కమీషన్ల పాలనగా మారిందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉంటూ ప్రజలకు ఏ మేలు చేయని కాంగ్రెస్‌ పారీ్టకి, సీఎం రేవంత్‌కు మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి అశిష్‌ షెలార్‌ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ రెండూ కూడా ప్రజలను వంచించే మోసపూరిత పార్టీలేనన్నారు. 

ఈ చార్జిషీట్‌లో ఏముందంటే.. 
⇒ ఉద్యోగులకు మోసం : అన్ని పెండింగ్‌ డీఏలు ఇవ్వకుండా, పీఆర్‌సీ అమలు చేయకుండా, హెల్త్‌కార్డులు ఇవ్వకుండా, ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం తీసుకురాకుండా మోసం. 
⇒ అన్నదాతల అరిగోసలు : కొందరికే రుణమాఫీ, రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఇస్తామని దానికీ మంగళం, రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వలేదు, భూ భారతితో కొత్త వివాదాలకు ఆజ్యం. 
⇒ ఆగమైన విద్యా రంగం: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించలేదు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా ఇవ్వలేదు, మున్సిపాలిటీల్లో ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు మరిచారు. 
⇒ వైద్యం అగమ్యగోచరం : రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా రూ.10 లక్షలు అని మరిచారు. బిల్లులు చెల్లించక ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం నిలిపివేత, ప్రతీ జిల్లా కేంద్రంలో సూపర్‌ స్పెషాలిటీ, అన్ని మున్సిపాలిటీల్లో వంద పడకల ఆస్పత్రులు తదితరాలు అమలు కాలేదు 

⇒ మహిళలకు మహా మోసం: ప్రతీ నెల రూ.రెండున్నర వేలు ఆర్థిక సహాయం ఇవ్వలేదు. ఈ లెక్కన ప్రతీ మహిళకు రూ.లక్ష చొప్పున సర్కార్‌ బాకీ పడింది. కళ్యాణమస్తులో తులం బంగారం ఇస్తామని మొండిచేయి. 
⇒ కార్మీకులపై కక్ష : అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పన చట్టం అమలు జాడలేదు. వారి కోసం సంక్షేమ బోర్డు, హమాలీల బోర్డు ఏర్పాటు కాలేదు.హెల్త్‌కార్డులు ఇవ్వలేదు 
⇒ యువత ఆశలు ఆవిరి: ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అమలు కాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ కాలేదు.యూపీఎస్‌సీ తరహాలో జాబ్‌ క్యాలెండర్, ప్రతీ ఏడాది జూన్‌2న నోటిఫికేషన్లు, సెపె్టంబర్‌ 17కు నియామకాల పూర్తి హామీకి తిలోదకాలు. 

⇒ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నయవంచన : అంబేడ్కర్‌ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం హామీ అమలు మరిచారు. అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని పెంచలేదు. 
⇒ పారిశ్రామికాభివృద్ధిపై నిర్లక్ష్యం : పూచీకత్తు లేని రుణాలకు ఎమ్మెస్‌ఎంఈల కోసం రాష్ట్ర స్థాయి క్రెడిట్‌ గ్యారెంటీ పథకం హామీ మరిచారు. 
⇒ సింగరేణిపై సిగపట్టు: సింగరేణి కార్మీకుల సంక్షేమానికి, అభివృద్ధికి, వారి భద్రతకు చేపడతామన్న పటిష్టమైన చర్యలు తీసుకోలేదు, సింగరేణిలో ఆధునిక విద్యాలయాల ఏర్పాటుపై ఒక్క అడుగూ పడలేదు.   

Advertisement
 
Advertisement
Advertisement