బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ ప్రజా ధనంతో బాబ్రీ మసీదు నిర్మించేందుకు చూశారని.. కానీ, గుజరాతీ బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని అన్నారు.
మంగళవారం గుజరాత్‌లో జరిగిన యూనిటీ మార్చ్‌లో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ.. ‘‘నాడు దేశ తొలి ప్రధానిగా ఉన్న నెహ్రూ ప్రజా ధనంతో బాబ్రీ మసీదు కట్టాలనుకున్నారు. ఆ ప్రయత్నాన్ని ఎవరైనా అడ్డుకున్నారు అంటే అది గుజరాత్ అమ్మ కడుపున పుట్టిన సర్దార్ వల్లభాయ్‌పటేలే. నెహ్రూ నిర్ణయానికి ఆయన ఏమాత్రం అంగీకరించలేదు. ఆ సమయంలో సోమనాథ్ ఆలయ(గుజరాత్) ప్రస్తావనను నెహ్రూ తీసుకొచ్చారు. అయితే..
సోమనాథ్ ఆలయ అంశం పూర్తిగా వేరు అని.. అది పూర్తిగా ప్రజల విరాళంతో(ట్రస్ట్ ఏర్పాటు చేసి) నిర్మించిందని.. ఒక్క పైసా ప్రభుత్వం ఖర్చు చేయలేదని పటేల్ నెహ్రూకు గుర్తు చేశారు. సరిగ్గా ఇదే ఇప్పుడు అయోధ్య రామమందిర విషయంలో జరిగింది. రాముడి ఆలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజలే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. ఇది నిజమైన సెక్యులరిజం అంటే’’ అని రాజ్‌నాథ్ అన్నారు. అదే సమయంలో..
1946లో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే అవకాశం సర్దార్ పటేల్‌కు వచ్చిందని.. మహత్మా గాంధీ సూచన మేరకే పటేల్ తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారని.. అలా నెహ్రూ ఆ టైంలో అధ్యక్షుడు అయ్యారని రాజ్‌నాథ్ అన్నారు. కొన్ని రాజకీయ దుష్టశక్తులు చరిత్ర నుంచి పటేల్ లెగసీని చెరిపేసే ప్రయత్నం చేశాయని.. కానీ, ప్రధాని మోదీ మాత్రం పటేల్ గొప్పదనం ఏంటో ప్రపంచానికి చాటి చెబుతున్నారని రాజ్‌నాథ్ అన్నారు.


