ఏపీ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఊగిపోతూ, జుట్టు ఎగరవేస్తూ ఆవేశంతో ప్రసంగాలు చేస్తుంటే, ఆయనలో చిత్తశుద్ది ఉందని అభిమానులు బావించారు. చెప్పినవి చెప్పినట్లు చేస్తారని, ప్రభుత్వంలో తప్పు జరిగితే నిలదీస్తారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ఇచ్చిన హామీలను నెరవేర్చుతారని అంతా ఆశించారు. కాని అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు చూసి విస్తుపోయే పరిస్తితి ఏర్పడుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఉచిత పధకాల గురించి మాట్లాడిన విషయాలు ప్రజలను అవమానించేలా ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతోంది. ప్రజలకు ఉచిత స్కీములు ఇస్తానన్నది టీడీపీ, జనసేనలు. అప్పుడు ఓట్ల కోసం దేహీ అని ప్రజలను ప్రాధేయపడిన ఈ పార్టీల నేతలు ఇప్పుడు స్వరం మార్చడం శోచనీయంగా ఉంది. చిత్రంగా ప్రజలేదో దేహి అని అడుగుతున్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారు.
అప్పుడెవరైనా ప్రజలు ఆయనను కలిసి తమకు ఫలానా స్కీమ్ కావాలని దేహీ అన్నారా? లేదే!. అయినా ఎందుకు సుమారు లక్షన్నర కోట్ల ఖర్చు అయ్యే స్కీములను కూటమి వాగ్దానం చేసింది. అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని ఎవరైనా అడిగితే ఇదే పవన్ కళ్యాణ్ ఏమని చెప్పేవారు! చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసునని, దానితో స్కీములు అమలు చేస్తామని అనేవారా?లేదా? గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబుకు మాటలు మార్చడంలో ఎంతో అనుభవం ఉందని భావిస్తారు. ఇప్పుడు అదే బాటలో పవన్ కళ్యాణ్ పయనిస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. కోనసీమ జిల్లాలో ఆయన ఒక సభలో మాట్లాడుతూ ఉచితాలతోనే ఓట్లు రావని, ప్రజలు ఈ స్కీముల ద్వారా దేహీ అన్నచందంగా మారకూడదని చెప్పారు. ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన అబిప్రాయపడ్డారు.
మరి ఇవే మాటలు ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదు? పైగా అప్పటి జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే అదనంగా ఇస్తామని, సూపర్ సిక్స్, ఎన్నికల ప్రణాళికలోని 140 అంశాలను అమలు చేసి చూపిస్తామని గప్పాలు కొట్టారే! చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మోసపూరిత హామీలు ఇస్తున్నారని, వారు చేసిన వాగ్దానాలకు లక్షన్నర కోట్ల వరకు అవసరం అవుతాయని, అవి ఎక్కడ నుంచి వస్తాయని ఆ రోజుల్లో జగన్ చెబితే ఆయనకు చేతకాదని ప్రచారం చేశారే. ఇప్పుడేమో చేతులెత్తేస్తున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్ కు ప్రజలను మోసం చేయాలన్న ఆలోచన లేకపోతే ఈ మధ్యనే సూపర్ సిక్స్ -సూపర్ హిట్ అంటూ భారీ సభలు పెట్టి ఉపన్యాసాలు ఎలా దంచారు? సూపర్ సిక్స్ లోని అంశాలనే పూర్తిగా అమలు చేయలేదు. అయినా హిట్ అన్నారు.
ఉదాహరణకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారా? లేదా?. నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయలు ఇస్తామని అన్నారా?లేదా? ఏభై ఏళ్లకే బిసిలకు పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పారా? లేదా? ఇలా అనేక అబద్దపు హామీలు ఇచ్చి, ఇప్పుడేమో ఉచితాలు మంచిది కాదని చెబుతారా? అంటే ఇచ్చిన హామీలను ఎగవేయడానికి ప్లాన్ వేసినట్లే కదా!. మహిళలకు ఉచిత బసు ప్రయాణం స్కీమును ఎందుకు ప్రకటించారు. దాని గురించి ఎవరైనా దేహీ అన్నారా? మహిళల నుంచి వస్తున్న నిరసనను తప్పించుకోవడానికి తూతూ మంత్రంగా దానిని అమలు చేశారు. అదే సమయంలో లక్షలాది ఆటోవాలాల ఉపాధికి గండి కొట్టారు. ఎవరి కాళ్లమీద వారు నిలబడాలని సుద్దులు చెబుతున్న పవన్ కళ్యాణ్ స్వయంగా ఉచిత బస్ స్కీమ్ ప్రారంభసభలో ఎందుకు పాల్గొన్నారు. ఆటోలవారి కాళ్లను కూటమి పెద్దలు విరగగొట్టినట్లే అనుకోవాలి కదా! పోనీ ప్రజా ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారా అంటే అదేమి లేదు. తమ షోకులను ఎక్కడా తగ్గించుకోవడం లేదు.
దుబారాకు అంతులేదన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రితో పాటు పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ లలో పర్యటనలు చేస్తున్నారు. అది అనవసర వ్యయమా? కాదా?. పేదలకు ఇవ్వడానికి డబ్బు లేదు కాని, విశాఖలో ప్రైవేటు పెట్టుబడిదారులకు, కోటీశ్వరులకు అడిగినా, అడగకపోయినా 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు ఎలా ఇస్తున్నారు?. అది ఉచిత స్కీమ్ కింద రాదన్నమాట. తూర్పు గోదావరి జిల్లాలో డ్రైనేజీల మరమ్మతుకు నాలుగువేల కోట్లు కావాలని, కాని ఆ డబ్బు లేదని చెబుతున్న పవన్ కళ్యాణ్, అమరావతిలో వేల కోట్లు అప్పుచేసి పనులు ఎలా చేపట్టగలుగుతున్నారు?ఇప్పటికే 29వేల కోట్ల అప్పు అమరావతి కోసం చేశారు. మరో 31 వేల కోట్లు మంజూరు అయ్యాయని గొప్పగా చెప్పుకున్నారు.అవి చాలవన్నట్లు మరో 7500 కోట్లు అప్పు తెచ్చుకున్నారు.
ఇక ప్రభుత్వ అవసరాల కోసం సుమారు 2.20 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆ డబ్బు అంతా ఏమైపోతోందో ఎవరికి అర్ధం కావడం లేదు. అమరావతిలో రోడ్డు నిర్మాణంలో కిలోమీటర్ కు 170 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదంతా దుబారా అవ్వదా! పవన్ కళ్యాణ్ వాటి గురించి మాట్లాడకుండా ప్రజలు ఉచిత పధకాలు కోరుకోరాదని చెప్పడం మోసం చేయడం కిందకు రాదా?ఎన్నికలకుముందు అన్నీ తన చేతిలోనే ఉంటాయన్నట్లు ఫోజు పెట్టిన పవన్ కళ్యాణ్, ఇప్పుడేమో తన వద్ద ఆర్ధిక శాఖ లేదని, ముఖ్యమంత్రిని నిధులు అడగాలని చెబితే ప్రజలకు ఏమి ప్రయోజనం కలుగుతుంది? అమరావతిలో 33వేల ఎకరాల భూమి తీసుకోవడాన్నే ఒకప్పుడు తప్పుపట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు సమర్ధిస్తున్నారు. అదనంగా మరో 40వేల ఎకరాలకు ప్రభుత్వం సిద్దం అవుతుంటే,క్యాబినెట్ లో ఒకసారి ప్రశ్నించారు. అయినా ప్రభుత్వం రెండోదశలో 20వేల ఎకరాలు అదనంగా తీసుకోబోతోంది కదా! దీనిని ఎందుకు పవన్ అంగీకరించారు? ఇలా ఒకటి కాదు.. అనేక అంశాలలో పవన్ కూడా డబుల్ గేమ్ ఆడుతూ చంద్రబాబుతో ఈ విషయంలో పోటీ పడుతున్నారు.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ మాటకు ప్రభుత్వంలో పెద్ద గా విలువ ఇవ్వడం లేదని, తొలుత ఏదో విన్నట్లు నటించి తర్వాత చంద్రబాబు ,లోకేష్ లు తమ పని తాము చేసుకుని పోతున్నారన్న ప్రచారం కూడా రాజకీయవర్గాలలో ఉంది. ఇక బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా అప్పుడప్పుడు ఉచితాలకు వ్యతిరేకం అంటూ గాత్రం అందుకుని విమర్శలకు గురి అవుతున్నారు. కొద్ది కాలం క్రితం బీహారులో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు రెండు లక్షల రూపాయలు డబ్బు ఇస్తామని చెప్పి ,తొలుత పదివేల రూపాయల చొప్పున ఇచ్చినప్పుడు వెంకయ్య అభ్యంతరం చెప్పి ఉంటే బాగుండేది కదా!. స్వయంగా ప్రధాని మోదీనే ఈ బటన్ నొక్కారు కదా! ఉచిత బస్ ప్రయాణాలు వద్దని చెప్పిన ఆయన పరిశ్రమలకు కోట్ల రూపాయల విలువైన భూములను 99 పైసలకే 66 ఏళ్ల లీజుకు ఇవ్వడం ఏమిటని ఎందుకు అడగలేదో తెలియదు.
2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేసినప్పుడు చంద్రబాబు ఇచ్చిన లక్షకోట్ల రూపాయల రుణాల మాఫీని వ్యతిరేకిస్తూ ఎక్కడైనా ప్రకటన ఇచ్చారా? అలా చేసి ఉంటే ఇప్పుడు ఏమి చెప్పినా విశ్వసనీయత వచ్చి ఉండేది. ఇక పవన్ కళ్యాణ్ రకరకాల చిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. ఎర్రచందంనం స్వామివారి రక్తం నుంచి పుట్టిందని కొన్నాళ్ల క్రితం ప్రకటించి ప్రజలు విస్తుపోయేలా చేశారు. కోనసీమకు తెలంగాణవారి దిష్టి తగిలిందని అంటూ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. దాని మీద తెలంగాణ నేతలు జగదీష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మంత్రులు తదితరులు మండిపడి పవన్ క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. వీటన్నిటి మీద విమర్శలు వస్తుంటే ,వాటిని తట్టుకోలేక సోషల్ మీడియాను బెదిరిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రశ్నించేవారిని భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, జనసేనలకు చెందిన వారు అసభ్యకర పోస్టింగ్ లు పెడుతున్నా పట్టించుకున్నట్లు కనపడదు. పవన్ కళ్యాణ్ గతంలో ఏమి ప్రసంగాలు చేసింది? అధికారం వచ్చాక ఏమి చేస్తున్నది?ఎలా మాటలు మార్చుతున్నది తెలిపే వీడియోలు బహుశా వందల సంఖ్యలో ఉండవచ్చు. వాటిని ఒక్కసారి చూడగలిగితే ఆయనేమిటో పవన్‌కే తెలుస్తుంది. మాట మార్చడం గొప్పదనం కాదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం గొప్ప విషయం అవుతుంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


