సాక్షి, విశాఖపట్నం: ఉద్యోగులపై వైజాగ్ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం మరో చీకటి దెబ్బ వేసింది. దేశంలో ఎక్కడాలేని విధంగా.. ఉత్పత్తి ఆధారిత వేతన విధానం అమలు చేస్తోంది. పేస్లిప్పులో పూర్తి జీతం.. ఖాతాలో మాత్రం కట్ అయిన జీతంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
ఉత్పత్తి ఆధారంగా జీతాలు అంటూ ఇటీవల సర్క్యులర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు పోరాటానికి దిగారు. సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే యాజమాన్యం కార్మికుల దానిని పట్టించుకోలేదు. జీతాల నుంచి 17 నుంచి 33 శాతం కోతలు విధించారు.
ఈ పరిణామంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కార్మిక సంఘాలతో కలిసి అడ్మిన్ బిల్డింగ్ ఎదుట ధర్నాకు దిగారు. తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేకుంటే లేబర్ కమిషన్‌లో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ కార్మికులపై కొనసాగుతున్న కుట్రలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా 6 వేల మంది కార్మికులను(గత నెల వ్యవధిలో 450 మంది కాంట్రాక్ట్ కార్మికులను) తొలగించారు. ఇప్పుడేమో ఉత్పత్తి ఆధారంగా జీతాల్లో కోతలు విధిస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా కూటమి నేతలు స్పందించడం లేదు. పైగా.. ఆ మధ్య స్వయానా సీఎం చంద్రబాబు స్టీల్‌ప్లాంట్‌ను వైట్ ఎలిఫెంట్‌తో పోల్చడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.


