సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం కొత్త కాదు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీతో మొదలు.. ప్రతీదాంట్లోనూ సొంత గొప్పలు చెప్పుకుంటూ సంకుచిత బుద్ధితో వ్యవహరిస్తుంటారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలోనూ అలాంటి పనే చేయబోయి.. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు.
విశాఖలో గూగుల్ నెలకొల్పబోయే డేటా సెంటర్.. ఆదానీ డేటా సెంటరే. గత వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందమే ఇది!. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు.. ఎట్టకేలకు ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు ప్రభుత్వమే ఒప్పుకుంది.
తాజాగా డాటా సెంటర్ కోసం భూకేటాయింపులు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అందులో.. అదానీ ఇన్‌ఫ్రా, అదానీ కనెక్స్ ఇండియా, అదానీ పవర్‌లకు భూ కేటాయింపు చేస్తున్నట్లు ప్రకటించింది. అడవివరంలో 120 ఎకరాలు, తర్లువాడలో 200 ఎకరాలు, రాంబిల్లిలో 160 ఎకరాలు.. మొత్తం 480 ఎకరాలు ఆదానీ సంస్థలకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో మెన్షన్ చేసింది. రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా నోటిఫైడ్ పార్టనర్లుగా అదానీ, భారతి ఎయిర్ ఎయిర్ టెల్ లకు భూ కేటాయింపు ఉత్తర్వులతో పాటు అన్ని రాయితీలు కల్పించాలని కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
దాదాపు రూ. 87 వేల కోట్ల పెట్టుబడి ఉన్న డాటా సెంటర్ విషయంలో యాజమాన్యం పేరు ఉసెత్తకుండా ఇంతకాలం చంద్రబాబు, నారా లోకేష్ మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అందుకు కారణం.. ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు జీవోతో ఆ బండారం బయటపడింది.
వైఎస్ జగన్ చెబుతోంది ఏంటంటే.. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ = అదానీ గ్రూప్ పెట్టుబడి + గూగుల్ క్లయింట్. అంటే ఈ డేటా సెంటర్‌లో గూగుల్ కేవలం క్లయింట్ మాత్రమే, కానీ అసలు నిర్మాణం, పెట్టుబడి అదానీ గ్రూప్‌దే. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అనేది నిజానికి అదానీ గ్రూప్‌తో కలిసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలోనే కుదిరింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు దానిని కొత్తగా తన ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్ట్‌లా చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.


