అక్రమ కేసులు ఎంతో కాలం నిలవవు
అండగా ఉంటా.. ధైర్యంగా ఎదుర్కొందాం
చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
తిరుపతి రూరల్: ‘నాన్న గారి ఆరోగ్యం ఎలా ఉంది మోహిత్.. ఈ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులు ఎంతో కాలం నిలబడవు.. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొందాం.. మంచి రోజులు వస్తాయ్.. మీకు అండగా నేనున్నాను.. ఎవరు అధైర్యపడవద్దు..’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. మాజీ సీఎం జగన్ మోహిత్‌ను ఆప్యాయంగా పలుకరించి మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తన తండ్రి ఆరోగ్యంపై జాగ్రత్తలు సూచించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను కలవాలని మోహిత్‌కు ధైర్యం చెప్పారు.


