నానాటికీ పడిపోతున్న కొబ్బరి ధర
అరటి, కోకోదీ అదే దారి
ఆహార, వాణిజ్య పంటల ధరలూ నిరాశాజనకం
చంద్రబాబు ప్రభుత్వంలో దక్కని గిట్టుబాటు ధరలు
పెరవలి : ఆంధ్రుల అన్నపూర్ణగా ఖ్యాతి గడించిన గోదావరి జిల్లాల్లోని రైతులు నానాటికీ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటల్లో దాదాపు ఏ ఒక్కదానికీ గిట్టుబాటు ధర లభించకపోవడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. తేమ శాతం నిబంధనల పేరుతో ఆహార పంట అయిన వరి ధాన్యానికి ఎలాగూ మద్దతు ధర ఇవ్వడం లేదు.
దీనికి తోడు మొక్కజొన్న, కొబ్బరి, అరటి.. ఇలా ఏ పంట చూసినా సరైన ధర లభించని దుస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, మంచి ధర వచ్చేలా చూసి, ఆదుకునే చర్యలు చేపట్టడం లేదని రైతులు ముఖ్యంగా ఉద్యాన రైతులు వాపోతున్నారు.
90 వేల మంది రైతులు
తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా సుమారు 90 వేల మంది రైతులు 64,536 హెక్టార్లలో మొక్కజొన్న, కొబ్బరి, కోకో, ఆయిల్‌పామ్, మామిడి, జామ, కంద, పసుపు, బొప్పాయి, నిమ్మ, తమలపాకులు, జీడిమామిడి వంటి వాణిజ్య, ఉద్యాన పంటలతో పాటు కూరగాయలు కూడా సాగు చేస్తున్నారు. ఈ పంటల సాగుపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 3 లక్షల మంది జీవిస్తున్నారు.
జిల్లా నుంచి వివిధ వాణిజ్య, ఉద్యాన పంట ఉత్పత్తులు రాష్ట్రం నలుమూలలతో పాటు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్,ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతూంటాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పంటకూ ముందుగానే గిట్టుబాటు ధర నిర్ణయించి, పంట చేతికొచ్చే సమయానికి కొనుగోలు ప్రారంభించేవారు. నేడు అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
మామిడి
జిల్లాలో 5,500 హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోంది. ఈ ఏడాది దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లభించలేదు. రకాన్ని బట్టి టన్నుకు రూ.17 వేల నుంచి రూ.25 వేలు మాత్రమే ధర లభించింది, గత ప్రభుత్వంలో ఇదే పంటకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకూ ధర లభించింది.
మొక్కజొన్న
జిల్లావ్యాప్తంగా 1,500 హెక్టార్లలో మొక్కజొన్న ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేస్తారు. దీనికి గరప, ఎర్రరేగడి నేలలు అనుకూలం. అందుకే, ఈ పంటను ఎక్కుగా లంకల్లో వేస్తారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2,600 ధర పలకగా, ఈ ఏడాది రూ.2,200 మాత్రమే దక్కుతోంది.
దొండ
కూరగాయల పంటల్లో అత్యధికంగా సాగు చేసే పంట దొండ. జిల్లావ్యాప్తంగా 400 హెక్టార్లలో దొండ సాగు ఉంది. సుమారు 4 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి దొండ రైతుకు ఈ ఏడాది చేదు అనుభవమే ఎదురైంది. ప్రస్తుతం రైతుకు కిలోకు రూ.5 మాత్రమే లభిస్తోంది.
వరి
ఈ ఏడాది ఖరీఫ్ వరి రైతుకు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. ప్రకృతి విపత్తులకు ఎదురీది సాగు చేసినా.. దిగుబడుల్లో నష్టాలు చవి చూస్తున్నా గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. ప్రభుత్వం 75 కేజీల బస్తాకు సుమారు రూ.1,780 మద్దతు ధర ప్రకటించినా తేమ శాతంతో పాటు సవాలక్ష ఆంక్షలు విధించింది. దీంతో, మరో మార్గం లేక రైతులు ధాన్యాన్ని దళారులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు. దొరికిందే చాన్సు అన్నట్టుగా దళారులు చేల వద్దకు వచ్చి రూ.300 నుంచి రూ.400 వరకూ తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.
కొబ్బరి
జిల్లావ్యాప్తంగా 8,050 హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతోంది. ఇక్కడి నుంచి నిత్యం 50 లారీల వరకూ కాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతూంటాయి. అన్నీ సక్రమంగా ఉంటే ఒక్కో చెట్టు నుంచి ఏటా 150 నుంచి 175 కాయల దిగుబడి వస్తుంది. ఎకరానికి 75 చెట్లు వేస్తారు. ఈ తోటల్లో అంతర పంటలుగా కూరగాయలు, కోకో, పూల సాగు వంటివి చేపడుతూ, అదనపు ఆదాయం పొందుతారు.
ఈ పంటపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన దింపు, ఎగుమతి, దిగుమతి కూలీలు, ఒలుపు కారి్మకులు, వ్యాపారులు సుమారు 30 వేల మంది ఉన్నారు. ఈ ఏడాది ఉత్తర ప్రదేశ్‌లో కుంభమేళా సందర్భంగా ఎక్కడ లేని డిమాండూ వచ్చి వెయ్యి కాయల ధర ఏకంగా రూ.32 వేలు పలికింది. ఇది రెండు నెలలుగా తగ్గుతూ వచ్చి, ప్రస్తుతం రూ.8 వేలకు పడిపోయింది.
కోకో
జిల్లాలోని 5,517 హెక్టార్లలో కోకో సాగు జరుగుతోంది. దీనిపై ఆధారపడిన వారు 10 వేల మంది ఉన్నారు. ఈ పంటను చిన్న పిల్లల్లా సాకాలి. తెగుళ్లను తట్టుకోలేవు. నీడ పట్టున పెంచాలి. అందుకే, దీనిని కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేస్తారు.
చాక్లెట్ల తయారీలో వాడే కోకో గింజలకు మంచి డిమాండ్ ఉన్నా ఈ ఏడాది తయారీ కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. దీంతో రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కిలో గింజల ధర రూ.1,050 ఉంటే నేడు రూ.350కి పడిపోయింది.
అరటి
జిల్లావ్యాప్తంగా అరటి సాగు 7,500 హెక్టార్లలో ఉంది. చక్కెరకేళీ, కూర అరటి (బొంత), ఎర్ర చక్కెరకేళీ, అమృతపాణి, కర్పూరం రకాలను ఇక్కడి రైతులు పండిస్తూంటారు. జిల్లా నుంచి నిత్యం 40 లారీల్లో అరటి గెలలు వివిధ ప్రాంతాలతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.
మే నెలలో 10 టన్నుల లారీ ధర రూ.2 లక్షలు పలికింది. అది కాస్తా నేడు రూ.40 వేలకు పడిపోయింది. గెలలను కొనే నాథుడు లేక అరటి రైతులు అల్లాడిపోతున్నారు. ఈ పంటపై ఆధారపడి రైతులతో పాటు నిత్యం కూలి పనులు చేసుకుంటూ సుమారు 12 వేల మంది జీవిస్తున్నారు.
జామ
పేదల యాపిల్‌గా పేరొందిన పండు జామ. దీనిని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. జిల్లాలోని 300 హెక్టార్లలో జామ సాగు ఉంది. ఇక్కడి రైతులు వివిధ దేశవాళీ రకాలతో పాటు కేజీ జామ, తైవాన్ జామ కూడా సాగు చేస్తున్నారు.
ఈ పంటపై వ్యాపారులు, కూలీలు కలిపి నిత్యం 3 వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జామ పండ్లకు మార్కెట్లో డిమాండ్ ఉన్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతుల వద్ద నుంచి వ్యాపారులు కిలో రూ.20 నుంచి రూ.25కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కిలోకు రైతుకు రూ.50 వరకూ దక్కేది.
తీవ్ర నష్టాలు
అరటి పంట తీవ్ర నష్టాలు మిగిల్చింది. తోటలు అమ్మినప్పుడు మంచి ధర లభించింది. నేడు మార్కెట్లో ధరలు పతనమవడంతో వ్యాపారులు సగానికి సగం కోత పెడుతున్నారు. దీంతో, మేం నష్టపోవాల్సి వచ్చింది. అసలు తోటలు కొనుగోలు చేయటానికే ఎవరూ రావటం లేదు. – వాకలపూడి గాం«దీ, అరటి రైతు, కానూరు
కొబ్బరి ధర పతనం
కొబ్బరి ధరలు దారుణంగా పతనమయ్యాయి. రెండు నెలలు క్రితం వెయ్యి కాయల ధర రూ.32 వేలు పలికితే నేడు రూ.8 వేలు ఉంది. అంటే వెయ్యి కాయలకు రూ.24 వేల మేర ధర పతనమైంది. – పెనుమత్స వెంకట గోపాలకృష్ణంరాజు, కొబ్బరి రైతు, ఖండవల్లి
ఇంత దారుణం ఎప్పుడూ లేదు
కోకో పంట దిగుబడి బాగున్నా వ్యాపారులు సిండ్‌కేట్‌గా మారి ధరలు తగ్గించారు. గతం ప్రభుత్వంలో కిలో రూ.1,050 పలికితే నేడు రూ.350 లభిస్తోంది. ఇంత దారుణం ఎప్పుడూ లేదు. – వాకలపూడి సూర్యారావు, కోకో రైతు, కానూరు
ప్రభుత్వమే ఆదుకోవాలి
క్వింటాల్ మొక్కజొన్న గింజలకు గత ఏడాది ధర రూ.2,600 ఉంటే నేడు రూ.2,200కు పడిపోయింది. దీంతో ఆర్థికంగా నష్టపోయాం, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతులను ఆదుకోవలసింది ప్రభుత్వమే. – కంటిపూడి సూర్యనారాయణ, మొక్కజొన్న రైతు, తీపర్రు


