ధాన్యం కొనుగోలులో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలం
వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఆగ్రహం
బాపట్ల జిల్లా పల్లెకోనలో ధాన్యం బస్తాలకు పాడె కట్టి రైతుల వినూత్న నిరసన
పల్లెకోన(భట్టిప్రోలు): ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు విమర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామంలో మంగళవారం రైతులతో కలసి అశోక్‌బాబు వినూత్నంగా నిరసన తెలిపారు.
‘దళారుల వ్యవస్థను అడ్డుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం... మద్దతు ధరకు ధాన్యం కొనడంలో విఫలం... పంటలకు బీమా చేయకుండా నిర్లక్ష్యం... రైతులకు యూరియా, కోతయంత్రాలను, టార్పాలిన్లను సరఫరా చేయడంలో వైఫల్యం... కులం, పార్టీలను పట్టించుకోకుండా రైతును రైతుగా చూడకపోవడం...’ అనే ఐదు రకాల పాడెలను కట్టి వాటిపై ధాన్యం బస్తాలు పెట్టి పురవీధుల్లో ఊరేగించారు.
అనంతరం ఆ పాడెల చుట్టూ అశోక్‌బాబు తిరిగి తలకొరివి పెట్టారు. ఆ తర్వాత ఆయన రోడ్డుపై స్నానం చేశారు. అశోక్‌బాబు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోందని చెప్పారు.


