మా సహనానికి పరీక్షా? | Bopparaju Venkateshwarlu Fires On Chandababu Govt about PRC, IR | Sakshi
Sakshi News home page

మా సహనానికి పరీక్షా?

Mar 15 2026 5:19 AM | Updated on Mar 15 2026 5:19 AM

Bopparaju Venkateshwarlu Fires On Chandababu Govt about PRC, IR

మాట్లాడుతున్న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఈ రెండేళ్లలో మీరు ప్రభుత్వ ఉద్యోగులకు చేసిందేమీ లేదు 

పీఆర్సీ లేదు.. ఐఆర్‌ లేదు.. బకాయిల ఊసే లేదు

ఇంతటి దయనీయ పరిస్థితి ఎప్పుడూ లేదు.. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేక పోతున్నాం 

చేతగాకపోతే తప్పుకోండని మాట్లాడుతున్నారు  

పీఆర్సీ దూరమవుతుందనే ఆందోళన అందరిలో ఉంది 

ఐఆర్‌ ప్రకటించక పోవడం చరిత్రలో ఇదే తొలిసారి 

సరెండర్‌ లీవులు, డీఏలు సైతం పెండింగే 

పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయం 

ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లలో ఒక్క రూపాయీ అందలేదు 

రిటైరైన వారు రావాల్సిన బెనిఫిట్లు తీసుకోకుండానే మరణాలు 

ఉద్యోగులకు రూ.30 వేల కోట్లు.. పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయిలు.. ప్రభుత్వానికి మేము సహకరిస్తున్నా.. ప్రభుత్వం నుంచి సహకారం లేదు 

చంద్రబాబు ప్రభుత్వంపై జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపాటు 

ఇది మంచి ప్రభుత్వం కానే కాదు.. ముంచిన ప్రభుత్వం :  ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి  

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను బానిసల కంటే హీనంగా చూస్తున్నారు  

ఉగాదిలోపు ఐఆర్‌ ప్రకటించకపోతే పోరాటం తథ్యం  

సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి రాగానే పీఆర్సీ వేస్తామన్నారు.. అంతకు ముందే ఐఆర్‌ ప్రకటిస్తామని చెప్పారు. తీరా గద్దెనెక్కాక ‘మీరెవరు?’ అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? ఉద్యోగులను ఇంత దారుణంగా వంచిస్తారా?’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నేతలు శనివారం చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. రెండేళ్లవుతున్నా పీఆర్సీ లేదు.. ఐఆర్‌ లేదు.. బకాయిల ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఆర్సీ దూరమవుతోందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఐఆర్‌ను ప్రకటిస్తూ వచ్చాయి. 

రెండేళ్లవుతున్నా ఐఆర్‌ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉద్యోగులకు రూ.30 వేల కోట్లు, పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయిల ఊసేలేదు. సరెండర్‌ లీవులు పెండింగ్‌.. డీఏలు పెండింగ్‌. మాకు చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. ఉద్యోగులందరూ ఆర్థికంగా నష్టపోతున్నారు. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయం. రిటైర్‌ అయిన ఉద్యోగులు వారికి రావాల్సిన బెనిఫిట్స్‌ అందుకోకుండానే కన్ను మూస్తున్నారు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. 

చేతగాకపోతే తప్పుకోండంటూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో ఇన్నాళ్లూ ఓపికగా ఉన్నాం. ఆ ఓపిక ఉద్యోగులు మాకు అవకాశం ఇచ్చినంత వరకే. ఆ తర్వాత చెప్పలేం’ అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కానేకాదని, ముంచిన ప్రభుత్వం అని ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను బానిసల కంటే హీనంగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఉగాదిలోపు ఐఆర్‌ ప్రకటించకపోతే పోరాటం తథ్యం అని స్పష్టం చేశారు. ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.    

ఉగాదిలోపు ఐఆర్‌ ప్రకటించకపోతే పోరాటమే
సాక్షి, అమరావతి :   ఉగాది నాటికి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఐఆర్‌ ప్రకటించకపోతే ఆందోళనలకు దిగుతామని ప్రభుత్వ ఉద్యో­­గు­ల సమాఖ్య అధ్యక్షుడు కె.  వెంకట్రామిరెడ్డి చంద్రబాబు ప్రభు­త్వాన్ని హెచ్చరించారు. తొలుత అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శలు చేస్తామని, అనంతపురం జిల్లాతో నిరసనలు ప్రారంభిస్తామన్నారు. తాడేపల్లిలోని సమాఖ్య కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నిరసన ప్రదర్శనల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో  మహా ధర్నా నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. ఐఆర్‌ ప్రకటించి, పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటుచేయాలని, లేనిపక్షంలో ఏప్రిల్‌ ఒకటి నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ప్రభు­త్వం వచ్చాక ఏ కేటగిరీ ఉద్యోగులకు కూడా మంచి జరగలేదని, ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా అణచివేస్తున్నారని, అనివార్యంగా పోరా­­డక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని ఉద్యోగులను ముంచిన ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు.  

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాకర్ల వెంకట్రామిరెడ్డి 

రెండేళ్లయినా ఐఆర్‌ ఊసేలేదు.. 
ఉద్యోగులను దారుణంగా వంచించారని, ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రెండేళ్లుగా ఉద్యోగులను పట్టించుకోకపోవడంవల్లే విజయవాడ ధర్నాచౌక్‌ ఉద్యోగుల ధర్నాలతో దద్దరిల్లుతోందన్నారు. ఒక్క డీఏ ఇచ్చి పండుగ చేసుకోవాలని చెప్పారని.. దానితో ఎన్ని పండుగలు చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఆర్నెల్లకు ఒకటి చొప్పున మొత్తం నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒకటి మాత్రమే ఇచ్చారని.. అది కూడా పూర్తిగా ఇవ్వకుండా కొంత పెండింగ్‌ పెట్టారని  తెలిపారు. అలాగే, ఐఆర్‌ వెంటనే ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని.. కానీ, రెండేళ్లయినా దాని గురించి మాట్లాడడంలేదన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన మాట మేరకు ఐఆర్‌ ఇచ్చిందని వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషనర్‌ రాజీనామా చేస్తే ఇప్పటివరకూ కొత్త కమిషనర్‌ను నియమించలేదని, ఇక పీఆర్సీ ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశ్నించారు.  

ఉద్యోగులకు రూ.40 వేల కోట్ల బకాయిలు..
ఇక ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకూ ఉన్నాయని.. వాటిని ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో లేదో కూడా తెలీడంలేదని వెంకట్రామిరెడ్డి అన్నారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా పోలీసులకు ఐదు ఎస్‌ఎల్‌లు పెండింగ్‌లో ఉన్నాయని.. సీపీఎస్‌ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం చూపించకపోగా కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయడంలేదని.. ఉద్యోగులకు కనీసం పదోన్నతులు కూడా ఇవ్వలేదన్నారు. అర్హతలేని వ్యక్తిని సెక్రటరీ జనరల్‌గా నియమించి అసెంబ్లీలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణను నిలిపివేయడం అన్యాయమని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బాధలు చెప్పలేని విధంగా ఉన్నాయని, రాజుల కాలంలో బానిసల కంటే దారుణంగా వారితో పనిచేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంత పని ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే 80 మంది ఉద్యోగులు చనిపోయారని.. అయినా వారిపై చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపడంలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు.  

ఈ రెండేళ్లలో ఉద్యోగులకు చేసిందేమీ లేదు
అనంతపురం అర్బన్‌ :  ‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఆర్‌సీ దూరమవుతోందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఐఆర్‌ను ప్రభుత్వాలు ప్రకటిస్తూ వచ్చాయి. కానీ, రెండేళ్లవుతున్నా ఐఆర్‌ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల ఊసేలేదు. సరెండర్‌ లీవులు పెండింగ్‌.. డీఏలు పెండింగ్‌. మాకు చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లలో ఒక్క రూపాయి కూడా వారికి అందలేదు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చేతగాకపోతే తప్పుకోండంటూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో ఓపికగా ఉన్నాం. ఆ ఓపిక ఉద్యోగులు మాకు అవకాశం ఇచ్చినంత వరకే. ఆ తరువాత చెప్పలేం’.. అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అనంతపురం విచ్చేసిన ఆయన శనివారం ఆ సంఘం కార్యాలయంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు దివాకర్‌రావు, మైనుద్దీన్, కార్యదర్శి సోమశేఖర్‌ తదితర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 

ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు.. 
ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన చెప్పారు., ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ త్వరలో ఇస్తామని గత ఏడాది అక్టోబరు 18న ముఖ్యమంత్రి  స్పష్టమైన హామీ ఇచ్చారని.. అయితే, ఐదారు నెలలు అవుతున్నా ఇప్పటికీ అమలుకాలేదని బొప్పరాజు అన్నారు. దీంతో పీఆర్‌సీ దూరం చేస్తారనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారన్నారు. జాప్యం చేయకుండా పీఆర్‌సీ కమిషనర్‌ను తక్షణం నియమించాలన్నారు. 60 రోజుల్లో నివేదిక ఇచ్చే వెసులుబాటు కల్పించాలన్నారు. తక్షణం ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇక ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్లకు పైగా బకాయిల ఊసేలేదని అన్నారు. సరెండర్‌ లీవులు ఇవ్వలేదని, డీఏలూ పెండింగ్‌ పెట్టారన్నారు. పోలీసులకు ఒక్క సరెండర్‌ లీవును రెండు విడతలుగా ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు. ఇంతటి దయనీయమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు. 

పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయి.. 
ఇక పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.10 వేల కోట్లు ఉన్నాయని బొప్పరాజు చెప్పారు. బెనిఫిట్లు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందకపోవడంతో వారు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని.. కానీ, అవి తీసుకోకుండానే రిటైర్డ్‌ ఉద్యోగులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులుగా తాము సహకరిస్తున్నామని, అదే స్థాయిలో ప్రభుత్వం సహకరించడంలేదని బొప్పరాజు చెప్పారు.

ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులు ఏమాత్రం సంతృప్తికరంగా లేరు. గత సంక్రాంతి పండుగకు ఇచ్చామంటున్న డీఏ ఇంత వరకు చాలా మందికి అందలేదు. సంస్కరణల పేరుతో ఉపాధ్యాయులను తీవ్రంగా వేధిస్తున్నారు. పదో తరగతి పరీక్షల మూల్యాంకనం రెమ్యూనరేషన్‌ ఇవ్వడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి యమలోకంలో ఉన్నట్లు ఉంది. 30 ఏళ్ల పిల్లలు కూడా గుండె నొప్పి, బ్రెయిన్‌ స్ట్రోక్‌లతో చనిపోతున్నారు.     
– బాజీ పఠాన్, అధ్యక్షులు, ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌

ఏ సమస్యా పరిష్కారం కాలేదు
ఉపాధ్యాయుల సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదు. వాటి కోసం దశల వారీగా ఉద్యమాన్ని చేపడుతున్నాం. కూటమి మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ ఆందోళనలు చేస్తాం. ఈ ప్రభుత్వం ఐఆర్‌ గురించి పట్టించుకోలేదు. బకాయిలు చెల్లించలేదు. పీఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్‌ లీవ్‌ బకాయిలు అలాగే ఉన్నాయి. పెన్షన్‌ కార్పొరేషన్‌ హామీ ఏమైందో తెలీదు.      
– రఘునాథ్‌రెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ)

త్వరలో ఆందోళన ఉధృతం
ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మా జీతం కింద దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ వంటి వాటిని కూడా మాకు ఇవ్వడంలేదు. పీఆర్సీ, ఐఆర్‌ గురించి అసలు ప్రస్తావనే చేయకపోవడాన్ని బట్టి అవి ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. ఉపాధ్యాయులను ప్రతి చిన్న విషయానికి వేధింపులకు గురి చేస్తున్నారు. లోపభూయిష్టమైన అసెస్మెంట్‌ రిజిస్టర్లతో ఇబ్బంది పెడుతున్నారు. త్వరలో ఉధృతంగా ఆందోళన తప్పదు.
–   ఏఎం గిరిప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement