విశాఖలో చెలరేగిపోతున్న మద్యం డాన్.. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే
చంద్రబాబు ప్రభుత్వం రావడంతోనే టాప్ గేర్‌లోకి దందా
బార్ల లైసెన్సులకు కప్పం ప్రకటన
లైసెన్స్ కావాలంటే బార్‌కు రూ.2 లక్షలు
దీనికితోడు నెలకు రూ.50 వేలు
ఆయన పచ్చజెండా ఊపితేనే బార్ల లైసెన్సులు
వత్తాసు పలుకుతున్న ఎక్సైజ్ శాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మద్యం డాన్‌గా చెలరేగిపోతున్నారు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి ఆయన తన దందాను టాప్ గేర్‌లోకి తీసుకువెళ్లారు. ఎక్సైజ్ శాఖ 125 బార్లకు జారీ చేసిన నోటిఫికేషన్ మొదలు ‘కప్పం కట్టండి...బార్ లైసెన్స్ తీసుకోండి’ అని హుకుం జారీ చేశారు. అందుకు విశాఖపట్నంలో ఎక్సైజ్ శాఖ వత్తాసు పలుకుతుండటంతో అడ్డూ అదుపు లేకుండా ఆయన దందా సాగుతోంది. ఒక్కో బార్ లైసెన్స్‌కు రూ.2 లక్షలు చొప్పున ఇవ్వడంతోపాటు నెలకు రూ.50 వేలు చెల్లించాలన్నది టీడీపీ ఎమ్మెల్యే మాట.
తద్వారా బార్ల లైసెన్సుల వ్యవహారంలో ఏకమొత్తంగా రూ.2.50 కోట్లతోపాటు నెలకు రూ.62.50 లక్షల చొప్పున వసూళ్ల దందాకు స్కెచ్ వేశారు. ఇక విశాఖలో ప్రాంతాలవారీగా ప్రజాప్రతినిధులకు వాటాలు ఇస్తుండటంతో వారందరూ సదరు టీడీపీ ఎమ్మెల్యే చెప్పినదానికి సై అంటున్నారు. జిల్లాలో కల్లుగీత కుటుంబాలకు కేటాయించిన బార్ల లైసెన్సుల విషయంలో కూడా ఆయన మాటే చెల్లుబాటు అయ్యే వరకూ లైసెన్సులు ఇవ్వలేదు.

ఎక్సైజ్ అధికారికే కప్పం వసూళ్లు, పంపిణీ బాధ్యతలు..
ఇక సదరు టీడీపీ ఎమ్మెల్యే తరఫున కప్పం వసూలు చేసి, వాటాలు పంచే బాధ్యతను ఏకంగా జిల్లాలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి కంటే ద్వితీయ స్థానంలో ఉన్న అధికారికి అప్పగించడం మరో విశేషం. సదరు అధికారి తాను చెప్పినట్టు కప్పం వసూలు చేసే బాధ్యతను కిందిస్థాయి అధికారులకు అప్పగించారు. అందుకు సహకరించని ఇద్దరు ఎక్సైజ్ సీఐలపైనా బదిలీ వేటు వేశారు. కాగా సదరు అస్మదీయ అధికారికి తాజాగా పదోన్నతి లభించింది. పదోన్నతి తీసుకుంటే మరో జిల్లాకు బదిలీ కావాల్సి ఉన్నందున, తనకు పదోన్నతే అక్కర్లేదని ఆయన చెప్పేశారు. మరో జిల్లాలో ఉన్నతాధికారి పోస్టు కంటే విశాఖ జిల్లాలో టీడీపీ మద్యం డాన్‌కు కుడిభుజంగా ఉండటమే ఎక్కువ లాభసాటిగా ఉంటుందన్నది ఆయన ఉద్దేశం. పెద్దల అండదండలు ఉండడంతో ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ కూడా చోద్యం చూస్తోంది.
మాట వినకపోతే...
విశాఖలో మొత్తం 125 బార్లకు తొలుత ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కప్పం చెల్లించేందుకు సమ్మతించిన 55 బార్లకే మొదటి దశలో లైసెన్సులు ఇచ్చారు. రెండోసారి నోటిఫికేషన్ జారీ చేయడంతో మరో 13 బార్లు, మూడోసారి నోటిఫికేషన్‌తో 27 బార్లకు లైసెన్సులకు పచ్చ జెండా ఊపారు. ఇక మిగిలిన బార్లకు
ఎక్సైజ్‌శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. కప్పం చెల్లించకుండా ఎవ్వరూ బార్లకు లైసెన్సులు దాఖలు చేయడానికి వీలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంటోంది.
⇒ తనను ధిక్కరిస్తూ లైసెన్సుల కోసం అప్లికేషన్ దాఖలుకు యతి్నంచినవారిపై టీడీపీ గూండాలతో దాడులు చేయిస్తూ బెదిరిస్తున్నారు.
⇒ తమకు కాదని లైసెన్సు తెచ్చుకున్నా నగరంలో బార్ ఏర్పాటు చేసేందుకు ఎవరూ స్థలాలు, భవనాలు అద్దెకుగానీ లీజుకుగానీ ఇవ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరికలూ జారీ అయ్యాయి.
⇒ సొంత స్థలాలు, భవనాల్లో బార్లను ఏర్పాటు చేయాలని భావిస్తే ఎక్సైజ్ అధికారులను పంపించి తనఖీలతో వేధిస్తామని కూడా బెదిరిస్తున్నారు.
⇒ దాంతో బార్లకు లైసెన్సులు దాఖలు చేసేందుకే ఔత్సాహికులు హడలిపోతున్నారు.


