పోలీసు పదోన్నతులకు గ్రహణం | Police Officials Express Dissatisfaction Over Promotions in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పోలీసు పదోన్నతులకు గ్రహణం

Mar 15 2026 5:34 AM | Updated on Mar 15 2026 5:34 AM

Police Officials Express Dissatisfaction Over Promotions in Andhra Pradesh

దీర్ఘకాలంగా పెండింగ్‌లో పదోన్నతులు  

తెలంగాణలో 1995 నుంచి 2002 బ్యాచ్‌ వరకు ప్రమోషన్లు 

ఏపీలో ఇంకా నిరీక్షణలోనే 1995 బ్యాచ్‌  

ప్యానల్‌లో ఉన్నా పదోన్నతి లేకుండానే రిటైర్‌మెంట్‌  

30 మంది అదనపు ఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐల పదోన్నతులు పెండింగ్‌లో 

అస్మదీయులకు అడ్డదారిలో ప్రమోషన్లకు రంగం సిద్ధం 

పోలీస్‌ అధికారుల్లో తీవ్ర అసంతృప్తి  

సాక్షి, అమరావతి: రాయలసీమలో ఇద్దరు అదనపు ఎస్పీ­లు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా పదోన్నతి జాబితాలో దీర్ఘకాలంగా ఉన్నారు. ఎస్పీ అనే హోదాతో గౌరవంగా రిటైర్‌ కావాలని ఆశించారు. కానీ ప్రభుత్వం పదోన్నతులను దీర్ఘకాలంగా పట్టించుకోకపోవడంతో అర్హత ఉన్నా సరే.. నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా పదోన్నతి పొందకుండానే ఇటీవల రిటైరయ్యారు. మరో మహిళా అదనపు ఎస్పీ త్వరలో రిటైర్‌ కాబోతున్నారు. అర్హులైనప్పటికీ పదోన్నతులు పొందకుండానే రాష్ట్రంలో ఎంతోమంది డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు రిటైరవుతున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే ఆ జాబితాకు అంతూపొంతూ లేకుండా ఉంది.

ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో పోలీసు అధికారుల పదోన్న­తులకు గ్రహణం పట్టింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో పోలీసు అధికారులు వరుసగా పదోన్నతులు పొందుతుంటే.. అదే బ్యాచ్‌లకు చెందిన ఏపీ అధికారులు మాత్రం పదోన్నతులు లేకుండానే రిటైరవుతున్నా అటు ప్రభుత్వం ఇటు డీజీపీ కార్యాలయం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. కానీ అర్హులను పక్కనపెట్టేసి.. అస్మదీయులకు మాత్రం కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ కోటాలో పదోన్నతులకు రంగం సిద్ధం చేస్తుండటం విస్మయపరుస్తోంది. రాష్ట్ర పోలీసు అధికారుల్లో తీవ్ర అసంతృప్తి రగిలిస్తున్న ఈ వ్యవహారం ఇలా ఉంది.. 

తెలంగాణలో చకచకా.. ఏపీలో కోల్డ్‌స్టోరేజ్‌..  
ఉమ్మడి ఏపీలో 1995, 1996, 1998, 2002 సంవత్సరాల్లో ఎస్‌ఐ పోస్టులు భర్తీచేశారు. సీఐలుగా పదోన్నతులు పొందినవారిని 2014లో రాష్ట్ర విభజన తరువాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన వారిలో 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన పోలీసు అధికారులందరికీ డీఎస్పీలు­గా పదోన్నతులు ఇచ్చారు. 1998 బ్యాచ్‌ వారిలో 88 శాతం మంది డీఎస్పీలయ్యారు. పెండింగులో ఉన్న 1998 బ్యాచ్‌­కు చెందిన 12 శాతం మందితోపాటు 2002 బ్యాచ్‌కు చెందిన అధికారులకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించే ప్రక్రియను తెలంగాణ పోలీసుశాఖ చేపట్టింది.

అర్హులైన అధికారులకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు సైబర్‌ క్రైం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, యాంటి నార్కోటిక్స్‌ తదితర విభాగాల్లో ప్రత్యేకంగా పోస్టులు సృష్టించింది. కానీ ఏపీలో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. 1995లో ఉమ్మడి ఏపీలో 400 మందికి పోస్టింగులు ఇవ్వ­గా రాష్ట్ర విభజన తరువాత వారిలో 233 మందిని ఏపీకి కేటాయించారు. వారికే ప్రభుత్వం ఇంకా డీఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వలేదు. ఇక 1996, 1998, 2002 బ్యాచ్‌లకు డీఎస్పీలుగా పదోన్నతి అన్నది కలగానే మిగిలిపోయేలా ఉంది. అవకాశం ఉన్న వివిధ విభాగాల్లో డీఎస్పీ పోస్టులు సృష్టించేందుకు ప్రతిపాదనలను కూడా రూపొందించనేలేదు.  

ఎన్నేళ్లీ నిరీక్షణ  
రాష్ట్రంలో అదనపు ఎస్పీ నుంచి నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా, డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీలుగా పదోన్నతుల కోసం అర్హులైన అధికారులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తూనే ఉన్నారు. 30 మంది అదనపు ఎస్పీలు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా, 20 మంది డీఎస్పీలు అదనపు ఎస్పీలుగా పదోన్నతుల జాబితాలో ఉన్నారు. వారికి పదోన్నతులు కల్పిస్తే సీఐలకు డీఎస్పీలుగా, ఎస్‌ఐలకు సీఐలుగా ప్రమోషన్‌ ఇచ్చేందుకు మార్గం సుగమమవుతుంది. నాన్‌ క్యాడర్‌ ఎస్పీ, డీఎస్పీల పోస్టులు క్లియర్‌ వేకెన్సీగా ఉన్నా.. పదోన్నతులకు డీజీపీ కార్యాలయం సానుకూలంగా స్పందించడం లేదు. దీంతో ప్యానల్‌ జాబితాలో ఉన్న అధికారుల్లో కొందరు పదోన్నతులు పొందకుండానే రిటైరవగా, కొందరు రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్నారు.  

కావాల్సిన వారికి మాత్రం..
అర్హులైన అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐల పదోన్నతులను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం.. అస్మదీయులైన అధికారులకు మాత్రం ఆగమేఘాల మీద పదోన్న­తులు ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఉన్న అధికారులకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో అధికారులకు 60 శాతం అదనపు వేతనం చెల్లిస్తారు. వివిధ పోలీసు పతకాలు ప్రదానం చేస్తారు కూడా. అర్హులైన అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐల పదోన్నతులను పక్కన పెట్టేసి మరీ... కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులకు ఆక్సిలరీ పదోన్నతులు కూడా కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించడం విమర్శలకు దారితీస్తోంది.

ఉగ్రవాద నిరోధక కార్యాకలాపాల్లో పాల్గొన్నారని వారికి పదోన్నతులు కల్పించేందుకు ప్రతిపాదించడం గమనార్హం. అందుకోసం హైదరాబాద్‌ పోలీసులు ఛేదించిన ఉగ్రవాద కేసును ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఖాతాలో వేసి పదోన్నతుల ఫైల్‌ను పరుగులెత్తిస్తున్నారు. హైదరాబాద్‌ పోలీసులు ఓ ఉగ్రవాద ముఠా కుట్రను ఛేదించారు. అక్కడ కొందరిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌ పోలీసులు ఇచి్చన సమాచారంతో విజయనగరం జిల్లాలో ఒకరిని అరెస్టు చేశారు. అయితే ఈ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగమేనని చెప్పి ఆ విభాగానికి చెందిన పదిమంది అధికారులకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు.

దీనిపై ఆ విభాగం ఉన్నతాధికారి తొలుత అభ్యంతరం తెలిపినా.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సమ్మతించక తప్పలేదు. ఈ పదోన్నతుల ఫైల్‌ ప్రస్తుతం డీజీపీ కార్యాలయం ‘ఓ’ సెక్షన్‌కు చేరింది. దీనిపై ప్రమోషన్లకు అర్హులైన అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంగా తమ పదోన్నతులను పక్కన పెట్టేసీ.. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులకు పదోన్నతులు కల్పిస్తే తాము వారికంటే జూనియర్లం అవుతామని ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల జాబితాలో ఉన్న తమకు పదోన్నతులు కల్పించిన తరువాత ఇతరులకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement