అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
అప్పుల్లోనే వృద్ధి.. సంపద సృష్టిలో తిరోగమనం
మంగళవారం మరో రూ.3,000 కోట్ల అప్పు
దీంతో బడ్జెట్ అప్పులే రూ.1,54,880 కోట్లకు చేరిక
బడ్జెటేతర అప్పులు మరో రూ.1,11,295 కోట్లు
ఇన్ని అప్పులు చేసినా ఆస్తుల కల్పన నిల్
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ హామీలకు తిలోదకాలివ్వడమే కాకుండా రాష్ట్రాన్ని రుణ భారంతో ముంచెత్తుతున్నారు. బడ్జెట్‌లోనూ, బడ్జేటేతర అప్పుల్లోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఏడాదిన్నర పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.2,66,175 కోట్ల అప్పులు చేసింది. తద్వారా ప్రజలపై భారీగా రుణ భారం మోపింది. చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ లోపల రూ.3,000 కోట్ల అప్పు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.3,000 కోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చింది. దీంతో బడ్జెట్ లోపల చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు రూ.1,54,880 కోట్లకు చేరాయి. ఇక బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో మరో రూ.1,11,295 కోట్ల అప్పులు చేసింది.
బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం రూ.71,295 కోట్ల అప్పు చేసింది. అలాగే రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్(ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ), ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్‌సీఎల్) నుంచి ఏకంగా రూ.40,000 కోట్ల అప్పు చేసింది.
ఆస్తులను సైతం ప్రైవేటుకు కట్టబెడుతూ..
బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు సర్కారు.. సూపర్ సిక్స్‌లోని ప్రధాన హామీలు సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. అలాగే ఇప్పటివరకు చేసిన అప్పులతో ప్రజలకు ఆస్తులు కల్పించకపోగా.. గత వైఎస్సార్‌సీపీ సర్కారు అభివృద్ధి చేసిన ఆస్తులను సైతం ప్రైవేటుపరం చేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలతో ఆస్తుల కల్పన చేయగా.. ఇప్పుడు వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తోంది.
కేవలం ఏడాదిన్నర పాలనలోనే చంద్రబాబు సర్కారు రూ.2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించట్లేదా అని ఆర్థిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కానీ గత వైఎస్సార్‌సీపీ పాలనలో లేని అప్పులు కూడా ఉన్నట్లుగా ఎల్లో మీడియా ఇష్టారీతిన దుష్ప్రచారం చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ బాబు అండ్ కో గగ్గోలు పెట్టిందని పేర్కొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు నోరు మెదపకపోవడం గమనార్హమని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్ అప్పు(రూ.కోట్లలో)
2024–25 ఆర్థిక సంవత్సరం మార్చి వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పు 81,597
2025–26 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పు 67,283
నవంబర్ 4వ తేదీ (ఆర్బీఐ ప్రకారం) 3,000
డిసెంబర్ 2వ తేదీ (ఆర్బీఐ ప్రకారం) 3,000
మొత్తం 1,54,880
బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా బాబు సర్కారు అప్పులు (రూ.కోట్లలో)
పౌరసరఫరాల సంస్థ 7,000
మార్క్‌ఫెడ్ 18,700
ఏపీఐఐసీ 8,500
ఏపీఎండీసీ 9,000
ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710
బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు 1,150
ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ 1,000
ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ 10,000
ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్ ద్వారా.. 5,473
నాబార్డు నుంచి డిస్కంలకు 3,762
మొత్తం 71,295
రాజధాని కోసం చేసిన అప్పులు(రూ.కోట్లలో)
ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు 15,000
హడ్కో 11,0
జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ 5,000
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ 7,500
ఏపీపీఎఫ్‌సీఎల్ 1,500
మొత్తం 40,000


