పీహెచ్‌సీకి తాళాలు.. సకాలంలో రాని 108
కాకినాడ జిల్లా చేబ్రోలులో ఘటన.. సిబ్బంది కొరతే కారణమన్న డీఎంహెచ్‌వో
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నియోజకవర్గంలో దారుణం
మండిపడిన స్థానికులు.. డీఎంహెచ్‌వో నిలదీత
పిఠాపురం: 24 గంటలూ పనిచేయాల్సిన పీహెచ్‌సీకి సిబ్బంది కొరతతో తాళాలు వేయడంతో అర్ధరాత్రి గుండెనొప్పితో అత్యవసరస్థితిలో వచ్చిన ఓ వ్యక్తి సకాలంలో చికిత్స అందక మరణించిన హృదయవిదారక ఘటన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జరిగింది. ప్రత్తిపాడు మండలం శరభవరం గ్రామానికి చెందిన ఇమంది మాణిక్యం (56) చేబ్రోలులోని ఒక హోటల్‌లో పనిచేస్తున్నాడు.
అతడు సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుండెనొప్పిగా ఉందంటూ సహచరులకు చెప్పాడు. హోటల్ నిర్వాహకులు అతడిని చేబ్రోలు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడకు వెళ్లేసరికి పీహెచ్‌సీకి తాళాలు వేసి ఉండడంతో 108కి కాల్ చేశారు. కానీ, 108 వాహనం కూడా గంట తరువాత వచ్చింది. అందులోని సిబ్బంది మాణిక్యాన్ని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. సకాలంలో వైద్యం అందకే మాణిక్యం మృతి చెందినట్లు అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. పీహెచ్‌సీ తీసి ఉంటే, ప్రథమ చికిత్స అంది ఉండేదని, మాణిక్యం బతికేవాడన్నారు.
డీఎంహెచ్‌వో విచారణ
ఈ ఘటన నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జె.నరసింహ నాయక్ మంగళవారం చేబ్రోలు పీహెచ్‌సీలో విచారణ జరిపారు. సిబ్బందిని, స్థానికులను అడిగి మాణిక్యం మృతికి కారణాలు తెలుసుకున్నారు. ఆస్పత్రికి తాళాలు వేసి ఉండకూడదన్నారు.
ఇక్కడ సిబ్బంది కొరతపై ఆరు నెలలుగా డీఎంహెచ్‌వోకు వినతులిచ్చామని, వాట్సాప్ సందేశాలు పంపించామని, అయినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని స్థానికులు ఆయనను నిలదీశారు. దీనిపై డీఎంహెచ్‌వో స్పందిస్తూ వైద్య సిబ్బంది సెలవుల పైన, డిప్యూటేషన్‌లో ఉండటం వల్ల ఇబ్బంది కలిగి ఉండవచ్చని, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు విచారణ నివేదిక అందజేస్తామని తెలిపారు.
వైద్యుడి సస్పెన్షన్
డ్యూటీ రోస్టర్ వేయడం, అత్యవసర విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను చేబ్రోలు పీహెచ్‌సీ వైద్యుడు సాయిరతన్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు డీఎంహెచ్‌ఓ నరసింహ నాయక్ తెలిపారు. చేబ్రోలు పీహెచ్‌సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఉన్నారని, వీరిలో ఒకరైన డాక్టర్ వి.నిఖిల్ సెలవులో ఉన్నారని, రెండో మెడికల్ ఆఫీసర్ సాయిరతన్‌ను సస్పెండ్ చేశామని, స్టాఫ్ నర్సుకు షోకాజు నోటీసు ఇచ్చామని వివరించారు.
తాళ్లరేవు వైద్యాధికారి ఎల్.సురేష్ కుమార్‌ను డిప్యూటేషన్‌పై చేబ్రోలు పీహెచ్‌సీకి పంపించామన్నారు. డిప్యూటేషన్‌పై ఉన్న స్టాఫ్ నర్స్‌ను చేబ్రోలు పీహెచ్‌సీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. ఇదిలా ఉంటే చంద్రబాబు పాలనలో పీహెచ్‌సీల్లో సిబ్బందినీ నియమించలేని దుస్థితి నెలకొందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


